ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! కాకరేపుతున్న సూళ్లురుపేట రాజకీయం!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం సూళ్లురుపేట.  తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుండే ఈ సెగ్మెంట్‌లో రెండు ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు  వుంటాయి.  భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్  ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట,  జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం మొదటిలో కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు  మరియు వైసీపీ రెండు సార్లు గెలిచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య టీడీపీ అభ్యర్ధి పారాస వెంకట రత్నంపై 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే సూళ్లూరుపేట వైసీపీలో అంత‌ర్గ‌త విభేధాలు ఆ పార్టీకి త‌ల‌నొప్పిగా మారాయి. ప్ర‌స్తుత ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సమక్షంలోనే వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం గొడ‌వ ప‌డుతూనే వున్నారు. వర్గ విభేదాలు,  వీధి కొట్లాటలతో వైసీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. 

స్థానిక ప్ర‌జ‌లు తాగునీటి సమస్యతో బాధ‌ప‌డుతున్నారు. జగన్ పరిపాలనలో మంచినీటి సమస్య తీరలేదని ప్రజలు వాపోతున్నారు.  పట్టణవాసులైతే డ్రైనేజీ సమస్యలతో అల్లాడుతున్నారు. డ్రైవర్ కాలనీ అంతా డ్రైనేజీ కాలనీగా మారిపోయింది. డ్రైనేజీ కోసం కాలువ తవ్వి ఐదేళ్లుగా అలా వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మురుగు కాల్వల నుంచి కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు.  ఐదేళ్ల క్రితం కాలువ కడతామని అక్కడ తవ్వి వదిలేశారు. అది అలాగే ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. డంపింగ్ యార్డు ఒకటి ఊరికి దరిద్రంగా మారింది. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ జాతీయ రహదారి పక్కనే వేసేస్తున్నారు. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డు దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దుర్వాసన ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. వర్షాకాలమైతే చెప్పలేం. దీని కారణంగా అంటు రోగాలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు.  దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో,  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 

మ‌రో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిలో భాగంగా  విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ ను కేటాయించారు. అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి ప్ర‌త్యేకంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల ను టీడీపీ అధిష్టానం పంపింది. సూళ్లూరు పేట‌, ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు కావ‌డంతో,  శ్రీల‌క్ష్మీ శ్యామ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. విజయశ్రీ గెలుపే ల‌క్ష్యంగా శ్యామ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  టీడీపీ కూటమి  హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్ళుందుకు ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  ఏపీలో వైసీపీ కథ ముగుస్తుందంటూ,  వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, మే 13న తమ తీర్పు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని ఆమె చెబుతున్నారు.  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.   చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమన్నారు.  అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్ చంద్రబాబు అని  విజయశ్రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  నియోజకవర్గంలో జగన్ పాలనపై వున్న తీవ్ర వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆమె చెబుతున్నారు.  

అధికార వైసీపీ ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఒకవైపున శ్రీహరికోట, మరోవైపు పారిశ్రామిక వాడ శ్రీ సిటీ అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో అన్నచందంగానే సూళ్లూరు పేట మారింది. సూళ్లూరుపేటలో వరుసగా రెండు సార్లు  గెలిచిన కిలివేటి సంజీవయ్య పరిస్థితి కూడా నియోజకవర్గంలో అంత ఆశాజనకంగా లేదు. తనకి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నలిగిపోతున్నారు. 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 31 వేల 638 మంది ఉన్నారు. మహిళలు 1 లక్షా 17 వేల 850 మంది ఉంటే, పురుషులు 1 లక్షా 13 వేల 736 మంది ఉన్నారు.  నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉంటారు, తర్వాత బీసీలు, ఆ తర్వాత ఓసీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికి రెడ్ల పెత్తనం ఎక్కువ. గెలిచిన ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లోనే ఉంటారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌