లాస్ట్ ఛాన్స్‌.. జ‌గ‌న్ బెయిల్‌ ర‌ద్దుపై విచార‌ణ‌..

ఇదే లాస్ట్ ఛాన్స్‌. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై కౌంట‌ర్ దాఖ‌లు చేయండి అంటూ జ‌గ‌న్  బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 26కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. ఓవైపు ఎంపీ ర‌ఘురామ కృష్ణరాజుకు బెయిల్ కోసం ఆయ‌న హైకోర్టు, సుప్రీంకోర్టులో గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న‌పై ఏపీ సీఐడీ అక్ర‌మంగా కేసు పెట్టారంటూ పోరాడుతున్నారు. ర‌ఘురామ బెయిల్ పిటిష‌న్‌పై ఏటూ తేల్చ‌కుండా సుప్రీంకోర్టు కేసు విచార‌ణ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేసింది. 

మరోవైపు.. ఇదే రోజు అక్ర‌మాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ వేసిన పిటిష‌న్ సైతం సీబీఐ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని న్యాయ‌స్థానం ఇది వ‌ర‌కే జ‌గ‌న్‌, సీబీఐను ఆదేశించింది. ఈ నెల 7న విచార‌ణ‌ జ‌రిగిన స‌మ‌యంలో కౌంట‌ర్ దాఖ‌లుకు జ‌గ‌న్‌, సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాదులు స‌మ‌యం కోరారు. తాజాగా, ఇవాళ కూడా మరోసారి గ‌డువు కావాలంటూ సీబీఐ కోర్టును కోరారు. ఈ క్ర‌మంలో సీబీఐ కోర్టు కాస్త ఘాటుగా స్పందించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి ఇదే చివ‌రి అవ‌కాశం అంటూ.. విచార‌ణ‌ను ఈ నెల 26కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. 

బెయిల్‌పై వ‌చ్చి ముఖ్య‌మంత్రిగా ఉంటూ.. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ ఇటీవ‌ల సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. జ‌గ‌న్‌ బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు ర‌ఘురామ‌. ఆ పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని జ‌గ‌న్‌ను, సీబీఐని ఆదేశించింది. అయితే, కౌంట‌ర్ దాఖ‌లుకు ప‌దే ప‌దే గ‌డువు కోరుతుండ‌టంతో.. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌ను వాయిదా వేసింది సీబీఐ కోర్టు. 

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం ఎంపీ ర‌ఘురామ పిటిష‌న్ వేసినందుకే ఆయ‌న్ను ఏపీ స‌ర్కారు టార్గెట్ చేసి.. కేసు పెట్టి.. అరెస్ట్ చేసి.. జైలుకు పంపించింద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇటు, జ‌గ‌న్‌ బెయిల్ ర‌ద్దు కోసం కోర్టులో పోరాడుతూనే.. అటు, త‌నకు బెయిల్ కోసం ర‌ఘురామ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.