పుట్టంరాజు కండ్రిగలో సచిన్ టెండూల్కర్ పర్యటన
posted on Nov 16, 2014 9:47AM

నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని భారతరత్న, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం పుట్టంరాజు కండ్రిగ గ్రామానికి చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్‌కి ఉన్నతాధికారులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులను పలకరించారు. స్థానికంగా వున్న చెరువులో చేపలను వదిలి మీనోత్సవాన్ని ప్రారంభించారు. పుట్టంరాజు కండ్రిగ గ్రామంలో దాదాపు మూడు కోట్ల రూపాయలతో కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సచిన్ పర్యవేక్షిస్తారు. ఈరోజంతా ఆయన ఆ గ్రామంలోనే గడుపుతారు. ఈ సందర్భంగా గ్రామంలోని పిల్లలతో సచిన్ క్రికెట్ కూడా ఆడారు. పుట్టంరాజువారికండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న అనంతరం మొదటిసారి సచిన్ ఆ గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.