సీపీఎస్ రద్దు హామీకి తూట్లు.. అదేమంటే నేరమా..?

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ధర్మా చౌక్ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు హామీకి ఇప్పటి వరకూ అతీ గతీ లేదని, కేంద్ర ప్రభుత్వం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయడం లేదని వారంటున్నారు. ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ ఇస్తామని ప్రకటించారని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు అంటున్నారు. రాబోయే రోజులన్నీ.. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులదేనని, ఉద్యమం చేయడం వల్లే మళ్లీ అవినీతి నిరోధక శాఖ దాడులు మొదలయ్యాయని చెప్పుకొస్తున్నారు. ఇలా దాడులు చేస్తూ... ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, చట్టబద్దంగా రావాల్సి వాటిని మాత్రమే తాము అడుగుతున్నామని, ఇది నేరమా అని వారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

దాదాపు మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఉద్యమం ఆగాలంటే డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదని, ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత   అంటున్నారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ వాదనే వినిపిస్తున్నారని... బొప్పరాజు గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, డీఏలు అవసరం లేదా అని అడిగారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి చెప్పినవన్నీ ప్రభుత్వం చెప్పినట్లుగానే తాను భావిస్తున్నారని.. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనపై ఇటీవలే ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణం అని విమర్శించారు. ఇటీవలే కాకినాడలో ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఏ నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పడుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రతీ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు.

ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చినా కూడా..ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని వారు చెందుతున్న ఆవేదనకు ఏపీ ప్రభుత్వం దిగి వస్తుందా? రానున్న రోజుల్లో ఉద్యోగుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.