ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీపై ఊహాగానాలు నిజమేనా..!
posted on Dec 15, 2020 8:34AM
ఏపీ హైకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు తీర్పులు వచ్చిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనాల ముందు పలు కేసుల పై విచారణ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీ కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై బుధ, గురు వారాలలో ఒక ప్రకటన వెలువడవచ్చని ఆ వార్తల సారాంశం. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను అర్ధంతరంగా తొలగించడం వరకు ఏపీ సర్కారు తీసుకున్న అనేక చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఏపీ హైకోర్టు సిజి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ పై నారాయణ మాట్లాడుతూ "ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిని బదిలీ చేయించడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సీఎం జగన్ ఈ విషయంపై కేంద్రంలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే విషయం పై త్వరలో ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలను కూడా కలవనున్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ బదిలీ వ్యవహారం పై ప్రజలలో పలు అనుమానాలతో పాటు ఈ విషయం పై ఉత్కంఠ కూడా నెలకొంది.