తిరుపతిలో బీజేపీ పంచతంత్రం! ఏపీలో అధికారం దిశగా శంఖారావం

తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో కమలం దూకుడప పెంచింది. దుబ్బాక జోష్ తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెమటలు పట్టించి అనూహ్యా  ఫలితాలు సాధించింది.  రెండు వరుస విజయాలతో ఇప్పుడు తెలంగాణలో కమలదళం బలమైన శక్తిగా అవతరించింది. వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పార్టీ బలోపేతానికి స్కెచ్ వేస్తోంది బీజేపీ. అక్కడ దుబ్బాక విజయాన్ని తమ జైత్రయాత్రకు పునాదిగా వేసుకోగా..  ఏపీలో  తిరుపతిని అందుకు వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో త్వరలో జరగనున్న లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఏపీలో అధికారం దిశగా తొలి అడుగు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే తిరుపతి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు.. గెలుపే లక్ష్యంగా పంచ తంత్రాన్ని రచించారని చెబుతున్నారు. 

 

తిరుపతి ఉప ఎన్నికలో గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రేటర్ రాయలసీమ డిమాండ్ వినిపించింది. రాష్ట్ర విభజన తర్వాత తాజాగా మళ్లీ ఆ నినాదం తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన గ్రేటర్ రాయలసీమ పుస్తకావిష్కరణలో మళ్లీ సీమ నేతలంతా తమ వాయిస్ ను మరోసారి గట్టిగా వినిపించారు. తెలంగాణ ప్రజలను ఆదర్శంగా తీసుకొని గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమించాలని  పిలుపునిచ్చారు. దీన్నే ఇప్పుడు అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. నిజానికి రాయలసీమ గురించి ఉమ్మడి ఏపీలోనే బీజేపీ గట్టిగా మాట్లాడింది. కర్నూల్ లో హైకోర్టు పెట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ తెరపైకి రావడంతో.. రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలనాధులు ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని చెప్పడం ద్వారా సెంటిమెంట్ రగిలించి.. దాన్ని తిరుపతి ఉప ఎన్నికలో క్యాష్ చేసుకోవాలని కార్యాచరణ సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇది బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

 

ఎక్కడ ఎన్నికలున్నా బీజేపీ ఎక్కువగా వినిపించేది హిందుత్వ నినాదమే. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ హిందుత్వ కార్డును బలంగా ఉపయోగించాలని కాషాయ పార్టీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చాకా హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీటీడీ, విజయవాడ కనకదర్గ వంటి ప్రముఖల ఆలయాల్లోనూ వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో జగన్ డిక్లరేషన్ అంశం పెద్ద దుమారమే రేపింది. క్రైస్టవ ప్రచారాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక క్రైస్తవ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం భృతి ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూ సాంప్రదాయాలు మంటగలిపేలా కావాలనే కొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 

ఇవన్ని ఇలా ఉండగానే  విజయవాడ మూడో పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు జరపడం రచ్చగా మారింది.  పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి  శాంటాక్లాజ్ టోపీలు ధరించడం  తీవ్ర కలకలం రేపుతోంది. వీటన్నింటిని తమ ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ప్రజలను తమవైపు తిప్పుకోవాలని ఏపీ బీజేపీ నేతలు ప్రణాళికలు రచించారని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీ జీవీఎల్ హాట్ కామెంట్స్ చేసి రాజకీయ హీట్ పుట్టించారు. తెలంగాణ బండి సంజయ్ చేసిన కామెంట్ల తరహాలోనే సర్జికల్ స్ట్రైక్ ప్రకటన చేశారు.  తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని జీవీఎల్  అన్నారు.  ఏపీలో మత రాజకీయాలు చేయడంలో పోటీ పడుతున్న వైసీపీ, టీడీపీలపై రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 

 

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు అదనపు బలం కానుంది. ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చరిష్మా బాగా కలిసివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో పవన్ కు భారీగా అభిమానులున్నారు. పవన్ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే తిరుపతిలో పవన్ తో విస్త్రతంగా ప్రచారం చేయించేలా కమలం నేతలు రోడ్ మ్యాప్ తయారు చేశారని తెలుస్తోంది. పవన్ తో వీలైనన్ని ఎక్కువ సభలు పెట్టించి.. ఆయన అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ఓట్లన్ని గంపగుత్తగా కమలానికి మళ్లేలా పావులు కదుపుతున్నారని సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా పవనే ఉండనున్నారని, అందుకు గబ్బర్ సింగ్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీకి బాగా కలిసి రావచ్చనే అభిప్రాయం రాజకీయ అనలిస్టులు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

 

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్ ఉంటారని చెబుతున్నారు. దాసరి ఎంపికలోనూ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన దాసరి శ్రీనివాసులు.. తిరుపతి అభివృద్ధికి బాగా కష్టపడ్డారనే టాక్ ఉంది. తిరుపతిలోని శ్రీసిటి, మీనాక్షి సెజ్ లకు అనుమతులు, భూసేకరణ విషయాల్లో శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారట. ఆ సెజ్ లతో తిరుపతి పరిసర గ్రామాల్లోని యువతకు భారీగా ఉపాధి దొరికింది. దాసరి శ్రీనివాస్ కు తిరుపతి ఏరియాలో మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు తిరుపతి ఎంపీ పరిధిలోనే కృష్టపోర్టు ప్రాంతం కూడా వస్తోంది.  కృష్ణపోర్టు ఏర్పాటులో కూడా దాసరి శ్రీనివాసే ప్రధాన పాత్ర పోషించారట. ఇది కూడా తమకు కలిసివస్తుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు. దాసరి శ్రీనివాస్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. తిరుపతి పరిధిలో ఆ వర్గ ఓట్లే ఎక్కువగా  ఉన్నాయంటున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే బీజేపీ హైకమాండ్ దాసరి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. దాసరిని ఎంపిక చేస్తే బీజేపీకి మరింత ప్లస్ అవుతుందనే ప్రచారం తిరుపతి నియోజకవర్గంలో జరుగుతోంది. 

 

చివరి అస్త్రంగా వలసలను ప్రోత్సహిస్తోంది బీజేపీ. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోని అసమ్మతి నేతలను గుర్తించి వారికి వల వేస్తోంది. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ కు చెందిన 15 మంది మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. త్వరలోనే మరికొందరు కమలం గూటికి చేరుతారని చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వలసల బాధ్యతలను ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి బీజేపీ హైకమాండ్ అప్పగించిందట. జిల్లాలో బలమైన నేతగా ఉన్న వాకాటి... ఇప్పటికే వైసీపీ, టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే లోపే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. రెండు పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. 

 

మొత్తంగా పంచతంత్రంతో  తిరుపతిలో గెలిచి.. ఏపీలో అధికారం దిశగా పావులు కదపాలని బీజేపీ పక్కా వ్యూహాలు సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఇవన్ని వర్కవుట్ అయితే మాత్రం తిరుపతి లోక్ సభను కమలం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులుచెబుతున్నారు. బీజేపీ ఎక్కడైనా గెలవాలని స్కెచ్ వేస్తే సాధించే వరకు విశ్రమించదనే టాక్ ఉంది. అయితే తిరుపతిలో అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి మరీ..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu