ఆవుకి హాల్ టిక్కెట్ ఇచ్చేశారు

 

జమ్ము కాశ్మీర్‌లో విద్యాశాఖ అధికారులు ఒక విచిత్రం చేశారు. త్వరలో జరగనున్న పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షల కోసం ఒక గోమాతకి హాల్ టిక్కెట్ జారీ చేసి అందరూ ఔరా అనుకునేలా చేశారు. సదరు హాల్ టిక్కెట్ మీద ఆవు ఫొటో వుండటం మాత్రమే కాదు.. ఆవు పేరు, తండ్రి పేరు కూడా విచిత్రంగా ఇచ్చారు. సదరు ఆవు పేరు ‘గోధుమరంగు ఆవు’ అట, ఆ ఆవు తండ్రి పేరు ‘ఎర్రని ఎద్దు’ అట. ఇలా హాల్ టిక్కెట్ జారీ చేయడం మాత్రమే కాదు... ఒక కాలేజీని పరీక్షా కేంద్రంగా పేర్కొంటూ సీట్ నంబర్, హాల్ టిక్కెట్ నంబర్ కూడా కేటాయించేశారు. మే 10వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. విద్యాశాఖ అధికారుల ఈ తలతిక్క వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఉదంతం మీద స్పందిస్తూ, ‘‘ఆవుకు హాల్ టిక్కెట్ మంజూరు చేయడం అభినందనీయమైన విషయం. సదరు ఆవు పరీక్షకు హాజరు కావాలని, మంచి మార్కులతో పరీక్ష పాసై, పాలిటెక్నిక్‌ డిప్లొమాలో అడ్మిషన్ కూడా పొందాలని కోరుకుంటున్నాను’’ అని వెటకారంగా అన్నారు.