కరోనా కష్టాల్లో భారత్.. 

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,66,317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. వైరస్ బారినపడి కొత్తగా 3,747 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,46,146 కు పెరిగింది. దేశంలో క‌రోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉండ‌గా, దేశంలోని గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది.

ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి.. 

హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావాల్సి ఉంది. చిరునామా తెలియకపోవడంతో  ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దీనిపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు  చేయగా.. పోలీసుల సహకారంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరింది. అయితే అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సూర్యాపేటలో రెండు రోజుల్లో 17 మంది మృతి.. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి మృతిచెందుతున్న బాధితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఆరుగురు కరోనా పేషెంట్లుమృతి చెందారు. శుక్రవారం పదకొండు మంది చనిపోగా, కేవలం రెండ్రోజుల్లోనే పదిహేడు మంది మృతిచెందడంతో కరోనా పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ వృద్ధులకు బీపీ షుగర్ ఉండటంతో చనిపోతున్నట్లు సమాచారం.