క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయోచ్‌....

కొవిడ్ కేసులు పెరుగుతున్నాయ‌ని అంతా హైరానా ప‌డుతున్నారు. చుట్టుప‌క్క‌ల చాలా మంది వైర‌స్ బారిన ప‌డుతుండ‌టంతో ఆందోళ‌న చెందుతున్నారు. ఒమిక్రాన్‌ భ‌యంతో ప్ర‌జ‌లు హ‌డ‌లిపోతున్నారు. ఇదంతా నిజ‌మే. పాజిటివ్ కేసులు అతిభారీగానే వ‌స్తున్నాయి. గ‌డిచిన వారం రోజులుగా రోజుకు 3 ల‌క్ష‌ల మార్క్ త‌గ్గ‌కుండా న‌మోద‌వుతున్నాయి. కేసులు పీక్స్‌కి చేరాక‌.. జ‌నంలో భ‌యం పెరిగాక‌.. జాగ్ర‌త్త‌లు తీసుకున్నాక‌.. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డం స్టార్ట్ అయింది. థ‌ర్డ్ వేవ్ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌నే సిగ్న‌ల్స్ వ‌స్తున్నాయి. 

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొన్నాళ్లుగా 3 లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. తాజాగా 2,55,874కి తగ్గాయి. ముంద‌టి రోజుతో పోలిస్తే 16శాతం మేర కొత్త కేసులు క్షీణించాయి. 20శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు.. 15.52 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌తో రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్యే అధికంగా ఉండేది. కానీ, తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదుకావడం ఊరటనిస్తోంది. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడతాయని అంచనా. 

46 వేల కేసులతో కర్ణాటక టాప్ ప్లేస్‌లో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  మ‌రోవైపు, కొవిడ్ మృతుల సంఖ్య పెరుగుతుంద‌టం ఆందోళ‌నక‌రం. సోమ‌వారం 614 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 171 మరణాలు కేరళలోనివే.