రెండు నెలల్లో 90 మంది ఎన్ కౌంటర్! పట్టు కోల్పోతున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గడ్ దండకారణ్యమంతా నివురుగప్పిన నిప్పులా మారింది.  వరుస ఎన్ కౌంటర్‌లతో మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం మావోయిస్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గడిచిన మూడు నెలల్లో యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొనే సిబ్బంది సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. ప్రస్తుతం ఒక్క బస్తర్‌ రీజియన్‌లోనే 80 వేల మంది డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ జవాన్లు నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.  తెలంగాణ సరిహద్దులో ఉండే మావోయిస్టుల కంచుకోట పూవర్తి, తెర్లం  నుంచి  అబూజ్‌మడ్‌ అడవుల వరకు 400 కిలోమీట‌ర్ల మేర పోలీసులు క్రమంగా క్యాంపులను విస్తరించారు.  అడవిలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపు ఏర్పాటైంది. ఒక్కో క్యాంపులో 2 వేల నుంచి 5 వేల వరకు బలగాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గడిచిన మూడున్నర నెలలుగా ఎన్‌కౌంటర్లు పెరిగాయి. 

అబూజ్ మడ్ దట్టమైన  అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.  బాహ్య ప్రపంచానికి ఆవల.. ఎక్కడో విసిరివేయబడ్డట్టుంటుంది అబూజ్ మడ్. దట్టమైన చెట్లతో అడుగు తీసి అడుగేయడమే కష్టం.  4 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం… నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలతో పాటు.. ఇటు తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లా.. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలితో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్స్ లో విస్తరించి ఉంది. నక్సల్స్ ఈ అబూజ్ మడ్ ను సేఫెస్ట్ ప్లేస్ గా ఎంచుకున్నారు. అలా ఈ ప్రాంతం నక్సల్స్ కు ఒక ప్రధాన స్థావ‌రంగా మారింది.  ఈ డెన్ ను కనుక నిర్వీర్యం చేస్తే… ఇక మావోయిస్టులు, ఇతర తిరుగుబాటు దళాల ఉనికే లేకుండా చేయొచ్చనే ఉద్దేశంతో మోదీ సర్కార్ అబూజ్ మడ్ పై దృష్టి పెట్టింది. తరచూ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎన్ కౌంటర్స్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది.  సరిహద్దు భద్రతా దళాలతో పాటు.. జిల్లా రిజర్వ్ గార్డ్ దళాలతో కలిసి ఈ ఆపరేషన్స్ చేస్తున్నాయి. సుశిక్షితులైన దళాలను రంగంలోకి దింపి మొత్తంగా అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవ‌డానికి కేంద్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. 

అబూజ్ మడ్ లో ఇటీవ‌ల జరిగిన ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లతో గడిచిన రెండు నెలల్లోనే 90 మందిని కాల్చి చంపారని హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి ఆరోపించారు. నక్సల్స్ స్థావరాలను గుర్తించి డ్రోన్ల ద్వారా విష రసాయనాలను చల్లుతున్నారని మండిపడ్డారు. ఆపై నక్సల్స్ స్పృహ తప్పగానే కాల్పులు జరిపి వారిని మట్టుబెడుతున్నారని మండిపడ్డారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లోకి తీసుకొచ్చి, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఏరివేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల నుంచి.. నేపాల్‌ వరకు రెడ్‌కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్న నక్సల్స్‌ ఇప్పుడు సేఫ్‌జోన్లు లేక సతమతమవుతున్నారా? దండకారణ్యంపై మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌