కేసీఆర్ లేఖ సారాంశం ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం మీద దండు కట్టి దండోరా మోగిద్దాం అంటున్న రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ కూడా చేరిపోయింది. మోదీ పాలన నియంతృత్వ పోకడలు పోతోందంటూ గత కొంతకాలంగా విమర్శిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈసారి డోసు పెంచి ఏకంగా మోడీ మీదికి లెటర్ బాంబ్ సంధించారు. 1950 ల నుంచి అమల్లో ఉన్న ఆలిండియా సర్వీస్ రూల్స్ ను ఇప్పుడు మార్చడం వెనుక నియంతృత్వ పోకడలే ఉన్నాయని కేసీఆర్ ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో ఏ సర్కారు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతమని ఆయన ఆక్రోశిస్తున్నారు. 

ఆర్టికల్ 312 ప్రకారం 1951 ఆలిండియా సర్వీస్ రూల్స్ ను పార్లమెంటే ఆమోదించిన విషయం తనకు తెలుసని, కానీ 1954 లో వచ్చిన ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ అధికారుల రూల్స్ ను కేంద్ర సర్కారు మార్చేందుకు పూనుకోవడం మాత్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమంటూ మోడీని దెప్పి పొడుస్తున్నారు. ఆనాటి రూల్స్ ప్రకారం బ్యూరోక్రాట్స్ ను డిప్యూటేషన్ మీద బదిలీలు చేసే వెసులుబాటు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉందని, దాని ద్వారా తమ విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, కానీ ఇప్పుడు సవరిస్తున్న సర్వీస్ రూల్స్ ప్రకారం రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా రంగంలోకిి దిగి బ్యూరోక్రాట్స్ బదిలీలు, డిప్యుటేషన్ ల మీద నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఉన్నతాధికారులు తమ విచక్షణ మేరకు పని చేసే ఆస్కారం ఉండదంటున్నారు. ఇది రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించడమేనని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసి పరిపాలనాంశాల్లో డైరెక్టుగా కేంద్రమే జోక్యం చేసుకునే కుట్ర జరుగుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కాబట్టి మోడీ సర్కారు ఇలాంటి చర్యలకు పూనుకోరాదని, అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలు తప్పు పడుతున్నాయి. పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ క్రమంలో మోడీకి నేరుగా లేఖాస్త్రాల ద్వారా తమ అసమ్మతిని వ్యక్తం చేశాయి. ఇప్పుడా వరుసలో కేసీఆర్ కూడా చేరిపోయారు. మొత్తానికి బీజేపీయేతర రాష్ట్రాలు కూడబలుక్కొని ఈ లేఖాస్త్రాలు సంధిస్తున్నాయని, రానున్న రోజుల్లో వీరి ఆధ్వర్యంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరిగే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.