జీతాల‌కే డ‌బ్బుల్లేవా? ఆదాయంపై జ‌గ‌న‌న్న అబద్ధాలా? లెక్క త‌గ్గిందేలే!!

ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ్‌.. అందుకే అడిగినంత జీతాలు ఇవ్వ‌లేం.. ఇచ్చినంత తీసుకొని, మూసుకొని కూర్చొండంటూ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను బెదిరిస్తోంది. వైసీపీ గ్రూపుల‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయిస్తోంది. తాజాగా, హైకోర్టు సైతం డ‌బ్బుల్లేక పోతే జీతాలు త‌గ్గించొచ్చు అంటూ వ్యాఖ్యానించింది. ఇంత‌కీ ఏపీ ఖ‌జానాలో నిజంగా కాసులు లేవా?  లేక‌, జ‌గ‌న‌న్న కావాలనే అబ‌ద్దాలు చెబుతున్నారా?  కాగ్ మాత్రం ఫుల్‌గా సొమ్ములు ఉన్నాయంటోంది? కేంద్రం సైతం తెలంగాణకంటే ఏపీకే ఎక్కువ నిధులు కుమ్మ‌రిస్తున్నామంటోంది. మ‌రి, ఆ ఆదాయ‌మంతా కాకెత్తుకు పోతోందా?  లేక‌, జ‌గ‌న‌న్న ఖాతాలో ప‌డుతోందా? 

జ‌గ‌న‌న్న గ‌ద్దెనెక్కాక కొత్త‌గా ఏపీకి ఒక్క కంపెనీ రాక‌పోయినా.. ఒక్క ప్రాజెక్టు తీసుకురాక‌పోయినా.. రాష్ట్రానికి నిధుల వ‌ర‌ద పారుతూనే ఉందంటున్నాయి లెక్క‌లు. కేంద్రం నుంచి రకరకాల రూపాల్లో సొమ్ములు ముడుతూనే ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా ఆదాయం ప‌డిపోయింద‌ని, జీతాలు పెంచ‌లేమ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ, కరోనా కారణంగా కేంద్రం నుంచి భారీగా అదనపు సహాయం అందింది. మ‌రోవైపు, రెవెన్యూ లోటు పూడ్చడానికి కేంద్రం అనూహ్యంగా రూ.23వేల కోట్ల సాయం చేస్తోంది. ఆదాయంలో తెలంగాణ‌కంటే ఏపీ కేవలం 2వేల కోట్లు మాత్రమే వెనుకబడింది. ఈ మాట మ‌రెవ‌రో అంటున్న‌ది కాదు. ఇటీవ‌ల కాగ్ త‌న నివేదిక‌లో ఇదే విష‌యం స్ప‌ష్టం చేసింది.

కాగ్‌ నివేదిక ప్రకారం ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు గ‌త‌ 8 నెలల గణాంకాల ప్ర‌కారం.. నెలకు సగటున రూ.11,500 కోట్లు చొప్పున ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ కాలంలో వచ్చిన ఆదాయం రూ.88,600 కోట్లు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు  నాలుగు నెలల పాటు కూడా ఇదే స్థాయిలో ఆదాయం లెక్కిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయం రూ.1,38,000 కోట్లకు చేరుతుంది. మార్చిలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి పన్నుల్లో వాటా కింద అదనంగా దాదాపు రూ.2000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఆదాయం రూ.1,40,000 నుంచి రూ.1,41,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం 2020-21లో వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.23,000 కోట్లు ఎక్కువ.
 
ఏపీకి పెరిగిన ఆదాయ అంచనాలో అధిక‌భాగం అంటే రూ.17,257 కోట్లను కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటు కింద ఇస్తోంది. విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని కేంద్రం ఈ గ్రాంటుతో భర్తీ చేస్తోంది. ఇందులో మొదటి 8 నెలల్లో రూ.11,500 కోట్లు ఇచ్చేసింది. మిగిలిన రూ.5757 కోట్లను డిసెంబరు నుంచి మార్చిలో నెలల్లో ఇస్తుంది. హైదరాబాద్‌ ను కోల్పోయినందుకు ఇంత భారీగా గ్రాంటు వస్తున్నప్పటికీ విభజన నష్టాల కారణంగా.. హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గుతోందంటూ సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారులు పదే పదే అవాస్తవాలు చెప్ప‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు ఉద్యోగులు. 

ఈ 8 నెలల్లో ఏపీకి వచ్చిన రూ.88,600 కోట్ల ఆదాయంలో కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో వచ్చినవి రూ.23,500 కోట్లు. ఇందులో  రూ.11,500 కోట్లు రెవెన్యూ లోటు గ్రాంటు నిధులు, రూ.969 కోట్లు స్థానిక సంస్థలకు వచ్చిన గ్రాంట్లు, మిగిలిన రూ.11,031 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు ఉన్నాయి. 

చంద్రబాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో పన్ను ఆదాయంలో తెలంగాణతో పోల్చితే ఏపీ ముందంజలో ఉంది. జగన్‌ వచ్చిన తొలి రెండేళ్లలో బాగా వెనుకబడి ఈ ఏడాది కొంత పురోగతి సాధించింది. చంద్రబాబు దిగిపోయే ఏడాది 2018-19లో ఏపీ పన్ను ఆదాయం రూ.62,395 కోట్లు కాగా, ఆ ఏడాది తెలంగాణకు వచ్చిన పన్ను ఆదాయం రూ.59,612 కోట్లు. అంటే, తెలంగాణ కంటే దాదాపు 3వేల కోట్ల ఆదాయం ఏపీకే ఎక్కువ‌గా వ‌చ్చింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఏపీ ఆదాయం తెలంగాణ‌తో పోల్చితే త‌గ్గింది. కానీ, ఆ మేర‌కు కేంద్రం సాయం రూపంలో బాగానే ముట్టింది. అదే ఈ ఏడాదికి.. ఏపీ పన్ను ఆదాయం రూ.62,962 కోట్లు రాగా, తెలంగాణకు రూ.64,857 కోట్లు వచ్చింది.  అంటే... ఏపీ కంటే తెలంగాణ పన్ను ఆదాయం కేవలం రూ.1895 కోట్లు మాత్రమే ఎక్కువ. 

ఇక‌, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.10,700 కోట్లమేర అదనపు భారం పడుతుందని సీఎం చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు మాత్రం పెరిగే జీతాలు తమకొద్దని, పాతజీతాలే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగుతున్నారు. వారు కోరినట్టుగా... పాతజీతాలు అంటే ప్రభుత్వం దృష్టిలో తక్కువ జీతాలు ఇచ్చి ఖజానాకు రూ.10,700 కోట్లు మిగిల్చినట్టే క‌దా? మ‌రి, ఇంత చిన్న లాజిక్‌ను జ‌గ‌న‌న్న ఎందుకు మిస్ అవుతున్నారో..?