భారతమ్మా.. జగన్‌ను ఆసుపత్రిలో చూపించండమ్మా..

ముఖ్య‌మంత్రి జ‌గన్మోహ‌న్‌రెడ్డి. తుగ్ల‌క్ సీఎం.. తుగ్ల‌క్‌ పాల‌న‌.. తుగ్ల‌క్ నిర్ణ‌యాలు.. అంటూ జ‌గ‌న్‌పై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. రాజ‌ధానికి మూడు ముక్క‌లు చేసిన‌ప్ప‌టి నుంచీ ఆయ‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. అద్భుత‌మైన అమ‌రావ‌తిని కాద‌ని.. మూడు రాజ‌ధానులంటూ.. ఏపీకి అస‌లు రాజ‌ధానే లేకుండా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌రెడ్డిదే అంటారు. అందుకే, ఆయ‌న్ను తుగ్ల‌క్ సీఎం అంటున్నారు. ఇలాంటి తుగ్ల‌క్ నిర్ణ‌యాలు రాజ‌ధానితోనే ఆగిపోలేదు.. ఆ త‌ర్వాతా చాలానే జ‌రిగాయి.. లేటెస్ట్‌గా మ‌రో తుగ్ల‌క్ డెసిష‌న్ తీసుకున్నారంటూ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

జిల్లాకు ఒక విమానాశ్రయం.. బోయింగ్‌ విమానాలు సైతం దిగేలా రన్‌వేలు.. ఎయిర్‌పోర్టులపై సీఎం జగన్‌ ప్రణాళికలివీ! ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా సీఎం మాటలు ఉన్నాయ‌ని.. రోడ్ల గుంతలను పూడ్చలేని ముఖ్యమంత్రి.. జిల్లాకో విమానాశ్రయం కడతానని చెబుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేస్తున్నారు. 

ఏపీలో విమానాశ్రయాలన్నీ దాదాపు ఖాళీగా పడిఉన్నాయి. సీఎం జగన్‌ మాత్రం జిల్లాకో ఎయిర్‌పోర్టు ఉండాలి.. బోయింగ్‌ విమానం దిగేలా రన్‌వేలు అభివృద్ధి చేయాలి.. అని అంటున్నారు. గ‌తంలోనే టీడీపీ ప్ర‌భుత్వం కడప, కర్నూలు విమానాశ్రయాలు ప్రారంభించింది. గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పనులు చేపట్టింది. తిరుపతిలో కొత్త టెర్మినల్‌ నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే గరుడ పక్షిలా ఉండేలా ఈ టెర్మినల్‌ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. అంతే కాదు.. గన్నవరం విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా విదేశానికి విమానం ఎగిరింది టీడీపీ ప్రభుత్వంలోనే! అయితే, జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్కో విమానాశ్రయం రెక్క తెగుతూ పోయింది. గన్నవరం నుంచి సింగపూర్‌కు గత ప్రభుత్వంలో ఎగిరిన విమాన సర్వీసు రద్దైంది. గ‌తంలో కడప ఎయిర్‌పోర్ట్ నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లేవారు ఉండ‌గా.. ఈ సర్వీసులు కూడా కొంతకాలం నుంచి ఆగిపోయాయి. ఇప్పుడు కడప విమానాశ్రయం నుంచి విమానాలే ఎగరడం లేదు. 

తాజాగా శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కడప, కర్నూలు నుంచి మళ్లీ విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం చేసుకునేందుకు ఆమోదముద్ర వేశారు. అది కూడా కడప నుంచి గతంలోలా నాలుగు నగరాలకు కాకుండా రెండు నగరాలకే విమాన సర్వీసులు తిరిగేలా ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలో విమానాశ్ర‌యం అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే, జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని టీడీపీ నేత‌లు తప్పుబ‌డుతున్నారు. మేము చేసిన ప‌నుల‌ను మీ ఖాతాలో వేసుకుంటారా? అని కొంద‌రు అంటుంటే.. ఇక జిల్లాకో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పార్టీ అధినేత‌తో స‌హా ప‌లువురు సీనియ‌ర్లు విమ‌ర్శిస్తున్నారు. విమానాల సంగ‌తి దేవుడెరుగు.. ముందు మంచి రోడ్లు వేయండి మ‌హాప్ర‌భోన‌ని ప్ర‌జ‌లు ప్రాదేయ‌ప‌డుతున్నారు. 

"అమ్మా.. భారతమ్మా.. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్‌లో గాని, విశాఖప్నటంలో గాని ఆసుపత్రిలో చూపించండమ్మా" అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వైఎస్ భారతికి విన్నవించడం ఆస‌క్తిక‌రంగా మారింది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అయ్యన్నపాత్రుడు పూర్తిగా తప్పు బట్టారు. ముఖ్యమంత్రి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తుగ్గక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయని అయ్యన్న ప్రశ్నించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి వాటి నిర్మాణాలను గాలికొదిలేసి జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతావా? అంటూ ఎద్దేవా చేశారు. 

ఉద్యోగులకు, పెన్షన్ దారులకు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని జగన్.. ఓటీఎస్ పేరుతో పేదల నుంచే డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. చెత్తమీద కూడా పన్ను వసూలు చేస్తూ.. జిల్లాకో ఎయిర్‌పోర్ట్ కడతామని చెప్పడానికి సిగ్గులేదా? అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. అంతేగా.. అంతేగా..అంటున్నారు ప్ర‌జ‌లు.