చిరుకి కాంగ్రెస్ సీనియర్ల వ్యతిరేకత !

హైదరాబాద్: ఇటీవల పార్టీలో చేరిన వారికి అగ్రతాంబూలం ఇస్తే ఏళ్ళతరబడి పార్టీనే నమ్ముకుని, పార్టీ పటిష్టత కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ నేతల మాటేంటని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దల వద్ద గట్టిగా నిలదీస్తున్నారు.రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు చోటు కల్పించే విషయాన్ని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో చిరంజీవి వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేక మల్లగుల్లాలు పడుతోంది.వాస్తవానికి సంక్రాంతికి ముందు లేదా 2012-13 బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రరాపా ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.  అయితే, వీరికి మంత్రివర్గంలో చోటు కల్పించడంపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీలే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇదే అంశంపై సీనియర్ నేత, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు స్పందిస్తూ కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ఇతర పార్టీలను తమలో విలీనం చేసుకోవచ్చు కానీ బైట నుంచి వచ్చిన వారికి వెంటనే ముఖ్యమైన పదవులు కేటాయించటం ఎంతమాత్రం మంచిది  కాదన్నారు. అంతేకాకుండా, రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు పార్లమెంటు సభ్యులు గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిసి ప్రరాపా నేతలకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ప్రతిపాదన పట్ల తమ నిరసన వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌ తాజా ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ వివాదంపై కాంగ్రెస్ అధినాయకత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలనీ, రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు అనుమతించాలని ఆయన కోరనున్నట్టు సమాచారం.

అదేసమయంలో మంత్రివర్గం విస్తరణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించే అంశాన్ని పరిశీలించాలన్న యోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద కిరణ్ సర్కారుకు ఆపద్బాంధవుడు లాంటి చిరంజీవికి కాంగ్రెస్ సీనియర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడాన్ని ప్రరాపా శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu