మట్టి సత్యాగ్రహంతో కాంగ్రెస్ కు ఒరిగేదేమన్న ఉందా?
posted on Nov 7, 2015 12:09PM

కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఉద్యమాలు చేస్తుందో.. ఆ ఉద్యమాల వల్ల ఆ పార్టీకి ఒరిగేదమన్న ఉందో లేదో తెలియదు కాని రోజుకో ఉద్యమం పేరుతో హడావుడి చేయడం ఎక్కువైంది. జగనే దీక్షలు, నిరసనలు అంటూ ఎప్పుడూ హడావుడి చేస్తుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఉద్యమాలు చేయడంలో జగన్ ను మించిపోయేలా ఉన్నారు. పోనీ చేస్తున్నారు.. వాటి వల్ల ఏమన్నా ఉపయాగం ఉందా అంటే అదీ లేదు.. ఏదో రెండు రోజులు హడావుడి చేయడం ఆ తర్వాత షరా మామూలే.. ఎవరి పనుల వారివి.
గతంలో కోటి సంతకాలు, కోటి ఎమ్మెస్ లు అంటు కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాల సంగతి ఎటు పోయిందో తెలియదు. ఎప్పుడో మొదలు పెట్టిన కోటి సంతకాల ఉద్యమంలో.. ఇప్పుడు సంతకాలు సేకరణ పూర్తయిందట.. దీనిని ఇప్పుడు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇస్తారట. అంతేకాదు ఆ తర్వాత కోటి ఎస్సెమ్మెస్ లు అంటూ మరో ఉద్యమం చేశారు. అది ఎంత వరకూ వచ్చిందో.. ఎన్ని ఎస్సమ్మెస్ లు వచ్చాయో.. కోటి ఎస్సెమ్మెస్ లు వచ్చేసరికి ఎంత టైమ్ పడుతుందో..వారికైనా తెలుసో లేదో. మళ్లీ ఇప్పుడు మట్టి సత్యాగ్రహం అంటూ మరో ఉద్యమం చేస్తున్నారు. అమరావతిలో ఉన్న మట్టినే తీసుకొని.. ఈ మట్టికుండలని ప్రధాని నరేంద్రమోడీకి పంపిస్తారట. దీనివల్ల వారికి ఒరిగేదేముందో వారికే తెలియాలి.
అసలు జగన్ నిరాహార దీక్ష చేసినప్పుడే కొంచెం కూడా కదలని మోడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మట్టి కుండలని పంపినంత మాత్రం రియాక్ట్ అవుతారా?. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సి విషయం ఏంటంటే.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఇక్కడ ఎంత హడావుడి చేసినా ప్రయోజనం ఉండదు. తాము చేయాల్సిన ఉద్యమాలు సోనియా సారథ్యంలో చేస్తే కనీసం సోనియా, రాహుల్ గాంధీ పార్లమెంట్లో నోరు విప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఏదో చేస్తున్నాం కదా అని ఇక్కడ గల్లీల్లో చేస్తే ఏం ఉపయోగముండదు. అసలు కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకి కేంద్ర ప్రభుత్వం నుండే ఎలాంటి స్పందన ఉండదు.. మరి అలాంటిది మోడీని కదిలించగలరా..? ఇవన్నీ ఆలోచించకుండా మట్టి కుండ ఉద్యమం అని బయలు దేరిన కాంగ్రెస్ పార్టీకి.. ప్రజలు వారి నోట్లో మట్టికొట్టకుండా చూసుకుంటే చాలా బెటర్..