జమ్మూ కాశ్మీర్ కి రూ.80 వేల కోట్లు ప్యాకేజి ప్రకటించిన ప్రధాని మోడీ

 

ఈరోజు శ్రీనగర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడి జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి రూ. 80, 000 కోట్ల ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించారు. ఆ రాష్ట్రంలో పి.డి.పి., బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయ్యిద్, రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమంటే తనకు చాలా ఇష్టమని ప్రధాని అన్నారు. రాష్ట్రాభివ్రుద్ధికి తన ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందుకోసం అవసమయితే ఇంకా నిధులు అందించడానికి తన ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. మోడీ ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజి పట్ల జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వం ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.