ఇచ్చినప్పుడే తీసుకుందాం.. తొందరేముంది? టీపీసీసీపై ఆశావహుల విచిత్ర కామెంట్స్ 

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి ఎంపికపై అధిష్టానం నాన్చుతూ పోతోంది. అదిగో కొత్త సారధి... ఇదిగో న్యూ పీసీసీ చీఫ్ అంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నా, హైకమాండ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నిర్ణయం తీసుకోలేకపోతోంది. అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించి ఐదారు నెలలు గడిచిపోతున్నా, కొత్త పీసీసీ చీఫ్‌ను మాత్రం నియమించలేకపోతోంది. 

అయితే, మొన్నటివరకు పీసీసీ పదవి కోసం హోరాహోరీగా తలపడ్డ ఆశావహులు కూడా, హైకమాండ్ ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదన్న తరహాలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పు ఎప్పుడు ఉంటుంది, మిమ్మల్నే వరిస్తుందా? అంటూ ఆశావహులను ఎవరైనా అడిగితే, విచిత్రమైన సమాధానం చెబుతున్నారట. తొందరేముంది, ఇచ్చినప్పుడే తీసుకుందామంటూ ఆశావహులు వ్యాఖ్యానిస్తున్నారట.
 
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లకు పైగా టైమున్నా, త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే పీసీసీ అధ్యక్షుడికి ఆర్ధిక భారం తప్పదు. ఒకవేళ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు వెంటనే పీసీసీని మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. దాంతో, అప్పుడే పీసీసీ పదవి ఎందుకనే భావనలో ఆశావహులంతా ఉన్నారని, అందుకే అధిష్టానంపైనా కూడా ఒత్తిడి తేవడం లేదని టీకాంగ్రెస్ నేతలు అంటున్నాయి. మొత్తానికి నిన్నమొన్నటివరకు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన ఆశావహులంతా, ఇప్పుడు సడన్‌గా సైలెంట్ అయిపోవడంపై గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు.