అమెరికా ప్రెసిడెంట్ టూర్ ఫుల్ సక్సెస్.. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండ్రోజుల భారత పర్యటన విజయవంతమైంది. మొదటి రోజు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైన దగ్గర్నుంచి.... తిరిగి అమెరికాకు పయనమయ్యేంతవరకు ట్రంప్‌కు అడుగడగునా ఘనస్వాగతం లభించింది. మొదటి రోజు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టగా, ఇక, మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమం అయితే... అమెరికా అధ్యక్షుడిని ఫుల్ ఖుషీ చేసింది. ట్రంప్ తోపాటు సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకాలు... అహ్మదాబాద్‌లో లభించిన అతిథి మర్యాదలకు ట్రంప్‌, మెలానియా ఉబ్బితబ్బిబైపోయారు. ఇక, తాజ్ అందాలను చూసి ట్రంప్ దంపతులు మైమరిపోయారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా అయితే, తాజ్ అందాలకు ఫిదా అయిపోయారు. రెండు గంటలకుపైగా తాజ్ దగ్గర గడిపి తనివితీరా ఆస్వాదించారు.

ఇక, రెండో రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు గ్రాండ్ వెల్‌కమ్‌ లభించింది. భారత త్రివిధ దళాల నుంచి ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, రాజ్ ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించి అక్కడ ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత, ట్రంప్-మోడీ మధ్య సుమారు రెండు గంటలపాటు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం, మోడీ, ట్రంప్ కలిసి సంయుక్త సమావేశం నిర్వహించి ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలను వివరించారు. 

ఇక, చివరిగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.... రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందు అనంతరం నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ్నుంచి అమెరికా బయల్దేరారు. ఎయిర్‌ ఫోర్స్ వన్ ప్రత్యేక విమానంలో తిరుగుపయనమైన ట్రంప్, మెలానియా దంపతులకు కేంద్ర పెద్దలు వీడ్కోలు పలికారు.