కడప లోక్ సభ.. అవినాష్ కి మూడో స్థానమే.. పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్యే!

జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసులో ఏ8గా ఉన్న అవినాష్ రెడ్డికి  కడప లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దింపడంతోనే నియోజకవర్గంలో వైసీపీ అధినేత పార్టీ పతనాన్ని శాసించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వివేకా హత్య కేసులో నిందితుడిగా సీబీఐ అవినాష్ పేరు చేర్చిన తరువాత కడపలో రాజకీయపరిణామాలు వేగంగా మారిపోయాయి.  వివేకాహత్యకేసులో నిందితుడికి కడప లోక్ సభ  టికెట్ ఇచ్చిన అన్న జగన్ మోహన్ రెడ్డిని షర్మిల సూటిగా ప్రశ్నిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ అవినాష్ ఓటమి కోరుతున్నారు.  కడప లోక్ సభ స్థానం వైఎస్ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు తలపడటం ఇదే మొదటి సారి.  ఇదే స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ అవినాష్ విజయం కోసం షర్మిల ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో తాను  ప్రచారం చేసిన అవినాష్ కు ప్రత్యర్థిగా ఆమె కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో ఏ పార్టీ విజయం కోసమైతే షర్మిల శక్తికి మించి మరీ కృషి చేశారో అదే పార్టీ ఓటమి కోసం ఇప్పుడామె కంకణం కట్టుకున్నారు.  

కడపలో తెలుగుదేశం అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. షర్మిల పోటీలో నిలవడంతో వైసీపీ ఓట్లలో భారీగా చీలిక వస్తుందని తెలుగుదేశం భావిస్తోంది. అది తెలుగుదేశం పార్టీకి పెద్ద సానుకూలాంశంగా మారుతుందని చెబుతున్నది.  మొత్తం మీద నియోజకవర్గ పరిస్థితులను విశ్లేషిస్తూ పరిశీలకులు కడప లోక్ సభ ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యే ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థి మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని చెబుతున్నారు.  

ముఖ్యంగా బద్వేల్, కడప, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గంలో అసంఖ్యాకంగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులు, అభిమానులు, మద్దతుదారులు ఈ సారి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారనీ, వారంతా షర్మిలకు మద్దతు పలుకుతున్నారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కడప లోక్ సభ పరిధిలో బాగా వెనుకబడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.