తాత్కాలిక రాజధానిపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్

 

 

విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రభావం రాజధాని కోసం ఏర్పాటు చేయబడిన శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్న వనరులను గుర్తించి, తదనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకే తమ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందని దానికి నేతృత్వం వహిస్తున్న శివరామకృష్ణన్ ఇప్పటికే చాలాసార్లు తమను కలుస్తున్న ప్రజా ప్రతినిధులకు, ప్రజా సంఘాల నేతలకు చెప్పారు. అయితే రాజధానికి అనుకూలమయిన ప్రాంతాన్ని గుర్తించే బాధ్యత కూడా తమకు అప్పగించడం వలన, ప్రజలు తమ కమిటీని రాజధాని కోసమే ప్రత్యేకంగా ఏర్పరిచిన కమిటీ అని అపోహ చెందుతున్నారని శివరామకృష్ణన్ అన్నారు. తాము రాజధానికి తగిన ప్రాంతాన్ని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం వరకే తమ బాధ్యత అని, కానీ అంతిమ నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొంటుందని ఆయన విస్పష్టంగా చెప్పారు.

 

రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై తుది నిర్ణయం తీసుకొనబోతున్నప్పుడు, ఇక కమిటీపై ఒత్తిడి చేయవలసిన అవసరం దానికేముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని నిర్మిస్తానని పదేపదే చెపుతున్నపుడు, ఇక కమిటీపై కొత్తగా ఏమి ప్రభావం పడుతుంది? రాష్ట్రప్రభుత్వం చెపుతున్న ప్రకారమే అక్కడే ఇప్పుడు తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు సిద్దమవుతోంది. తరువాత అక్కడే శాశ్విత రాజధాని కూడా నిర్మిస్తామని చెపుతోంది. అటువంటపుడు కమిటీ ఇక కొత్తగా చెప్పేదేముంటుంది? రాజధాని విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ ఇవ్వబోయే నివేదికను చూసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోబోదని స్పష్టం అవుతోంది. మహా అయితే హైకోర్టు, కమిటీ సూచించిన విధంగా ప్రభుత్వ శాఖలను వేర్వేరు జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును.

 

రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం అనేక పొరపాట్లు చేసింది. నిజానికి ఈ కమిటీని రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకొన్న వెంటనే నియమించి, విభజనకు ముందే తన నివేదికను ఈయమని ఆదేశించి ఉండి ఉంటే నేడు ఇటువంటి సందిగ్దం నెలకొని ఉండేది కాదు. కానీ ఆ విధంగా చేసినట్లయితే, కమిటీ ఫలానా ప్రాంతాన్ని రాజధానిగా చేయమని సూచిస్తే దానిని అమలుచేసినా, చేయకపోయినా దాని వలన తమకు ఎన్నికలలో మరింత నష్టం జరగవచ్చనే దురాలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కమిటీని నియమించడంలో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేసి తెలివిగా తప్పుకొంది. తత్ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రాజధాని ఎక్కడో తెలియని దుస్థితి నెలకొంది.

 

అటువంటి అవమానకర పరిస్థితి నుండి బయటపడేందుకే రాష్ట్రప్రభుత్వం ఈ తాత్కాలిక రాజధానికి సిద్దమయితే, రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసి రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకొందామని అత్యాశకు పోతున్నారు. కానీ వారు ఎన్ని రాజకీయాలు చేసినప్పటికీ వారు రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని గ్రహించి, ఇకనయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మసులుకోవడం నేర్చుకొంటే ఏదోఒకరోజున ప్రజలు వారిని క్షమించవచ్చును.