ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తుందా?

 

యూపీఏ ప్రభుత్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారం చేప్పట్టి రెండున్నార నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ ఊసే లేదు. ప్రత్యేక హోదా లేకపోవడం వలన ఈ రెండున్నర నెలలలో అనేక పెద్ద పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేస్తోందో కూడా తెలియదు. ఈ విషయం గురించి ఎవరు ప్రస్తావించినా, ప్రస్తావించకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపికయిన కాంగ్రెస్ యంపీ జైరామ్ రమేష్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని తరచూ నిలదీస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ విషయంపై నిలదీసినపుడు ప్రణాళిక శాఖా మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ ఆయనకు బదులిస్తూ ప్రస్తుతం ఈ అంశం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం యొక్క పరిశీలనలో ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు వస్తే వాటిని పరిశీలించేందుకు సిద్దంగా ఉందని జవాబిచ్చారు.

 

అయితే అంతకంటే ముందు రాష్ట్రంలో గుర్తించిన ఆ రెండు ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇచ్చేందుకు అవసరమయిన తంతు మొదలుపెట్టలేదు. ఇదేవిషయాన్ని జైరామ్ రమేష్ మళ్ళీ ప్రస్తావిస్తూ అసలు కేంద్రప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా? ఉంటే ఎప్పుడు ఇస్తారు? అని నిలదీశారు. రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాక, కేంద్రప్రభుత్వానికి ఆయన ఒక లేఖ కూడా వ్రాసారు.

 

అడగందే అమ్మయినా అన్నం పెట్టదన్నట్లు, ఆంధ్రా యంపీలు కూడా ఆపాటి శ్రద్ధ చూపించి కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు. ప్రత్యేక హోదా రానట్లయితే తీవ్ర ఆర్ధిక సమస్యలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి పరిశ్రమలు కూడా ఇష్టపడవు. పరిశ్రమలు రాకపోతే అభివృద్ధి జరగదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని యంపీలకు కూడా తెలుసు. కనుక ఇకనయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్టీలకు అతీతంగా రాష్ట్ర యంపీలు అందరూ గట్టిగా కృషిచేయాలి.