ఏపీ ఎన్జీఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం
posted on Sep 22, 2013 4:08PM
.jpg)
ఏపీ ఎన్జీవో నేతలతో ఆదివారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీమాంధ్రలో సమ్మె వలన జనజీవనం స్తంభించి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పరిపాలన స్తంభించిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని పరిస్థితి ఉందని అందువల్ల సమ్మె విరమించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు. దీనిపై స్పందించిన ఉద్యోగులు రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తే సమ్మె విరమిస్తామని వారు స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏపీఎన్జీవో సంఘం నేత అశోక్‌బాబు తెలిపారు. సమ్మె విరమించాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలు తమను కోరలేదని, రాష్ట్రం సమైక్యం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రజలు కోరుతున్నారని ఆయన మంత్రివర్గ సబ్ కమిటీకి తెలిపారు. తాము జీతాలు తీసుకుంటున్నామని, ప్రజలకు అన్యాయం చేయలేమని అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో నేతలతో పాటు మంత్రులు ఆనం రామ్‌నారాయణ రెడ్డి, కొండ్రు మురళీ తదితరులు పాల్గొన్నారు.