కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం.. వెంకయ్య
posted on Dec 6, 2014 1:34PM

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ ధోరణిని దుయ్యబట్టారు. సాధ్వి నిరంజన్ జ్యోతి తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, ఆ వ్యాఖ్యల మీవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏం కావాలో తనకే తెలియని స్థితిలో వుందని వెంకయ్య అన్నారు. ఓటమిని తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్రమోడీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ మీద ఎన్నో హేయమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు వాటి మీద ఆయనను క్షమాపణ కోరలేదని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. పార్లమెంట్‌లో చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడుతుందన్న భయంతోనే ఆ పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అంశాన్నీ నేర్చుకోవాలసిన అవసరం తమ పార్టీకి లేదని వెంకయ్య స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తూ సభా సంప్రదాయాలను మంటగలుపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.