దేశంలో కంప్లీట్ లాక్‌డౌన్.. కండీషన్స్ అప్లై..
posted on May 5, 2021 12:34PM
అవును. దేశంలో లాక్‌డౌన్ అమలు అవుతోంది. ఇందులో డౌటేమీ అవసరం లేదు. ప్రధాని మోదీ అధికారికంగా ప్రకటించ లేదు అంతే. అనధికారికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. అందుకే, దేశంలో ప్రస్తుతం సంపూర్ణ లాక్‌డౌన్ ఉందంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్‌లు పెరుగుతున్న వేళ.. ఈ ఆంక్షల విషయం ప్రస్తావనకు వస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు అన్ని స్టేట్స్‌లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మరింత కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేసింది. ఏపీలో హాఫ్ డే లాక్‌డౌన్‌ను బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత సకలం బంద్. తెలంగాణలోనూ లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ పెరుగుతోంది.
అటు, దేశ రాజధాని ఢిల్లీ ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్లో ఉంది. ప్రస్తుతానికి మే 10 వరకూ కొనసాగనుంది. అవసరమైతే అది మరింత కాలం పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అటు, కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలోనూ ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 27 రాత్రి నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్‌డౌన్ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ పాక్షిక లాక్‌డౌన్ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం.
హరియాణాలో మే మూడు నుంచి ఏడు రోజుల లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఒడిశా.. మే 5 నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. రాజస్థాన్‌లో ఈ నెల 17వరకు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఝార్ఖండ్‌లో గత నెల 22 నుంచి మే 6 వరకు.. లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పంజాబ్‌లో వారాంతపు లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ లాంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి. మధ్యప్రదేశ్ ఈ నెల 7 వరకు కరోనా కర్ఫ్యూ.. గుజరాత్‌లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. తమిళనాడులో మే 20వరకు కఠిన ఆంక్షలు.. కేరళలో ఈ నెల 9 వరకు కఠిన ఆంక్షలు.. అస్సాం, ఉత్తరాఖండ్‌లో రాత్రికర్ఫ్యూ అమలవుతోంది. ఇలా.. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక రకమైన ఆంక్షలు విధించడంతో.. దేశంలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా, కరోనా ఏమాత్రం కంట్రోల్‌కి రాకపోవడం కలవర పాటుకు గురి చేస్తోంది. అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం లేకపోవడం.. కల్లోల సమయంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడంతో.. వైరస్ మరింతగా విజృంభిస్తోంది. ప్రస్తుత కరోనా కల్లోలానికి ప్రభుత్వాలు, పాలకుల ఉదాసీన వైఖరే కారణంగా కనిపిస్తోంది.