చింతమనేనిని అరెస్ట్ చేస్తారా లేదా?

 

టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న దెందులూరు ఎమ్మెల్యే , చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ప్రవర్తన టీడీపీకి తలనొప్పిగా మారింది. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న చింతమనేనిపై కొన్ని నెలల క్రితం దళితుడిపై దాడి కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదయ్యింది. ఆ కేసులో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని వామపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. కొన్ని రోజులక్రితం ఈ కేస్‌లో చింతమనేనిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆయన్ని అరెస్ట్‌ చేయాలంటూ కమ్యూనిస్ట్‌ నేతలు డీజీపీని కోరారు. వారం రోజుల్లోగా చింతమనేనిని అరెస్ట్‌ చేయకపోతే విజయవాడలో కమ్యూనిస్ట్‌ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  అయినా చింతమనేనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో తాజాగా విజయవాడలో  చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.


నాలుగున్నర ఏళ్ళుగా చింతమనేని అరాచకాలను చంద్రబాబు సమర్దిస్తూనే ఉన్నారని నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదై మూడు నెలలు కావస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతారో.. లేక రౌడీయిజానికి సపోర్టు చేస్తారో తేల్చుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రౌడీషీటర్ చింతమనేనిని చీఫ్ విప్ గా ప్రకటించడం సరికాదన్నారు. చర్యలు తీసుకోకపోతే వ్యవస్థలు భ్రష్టుపడతాయని తెలిపారు. చిత్తశుద్ది ఉంటే చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చింతమనేని ఆగడాలకు చంద్రబాబు అడ్డుకట్ట వేస్తారో లేదో...?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu