కంటి శుక్లం గురించి ఈ అపోహలు తొలగించుకోండి..!

కంటిశుక్లం అనేది కంటికి ఉండే సహజ లెన్స్ మీద ఏర్పడే తెల్లని పొర. ఇది కనుపాప వెనుక ఉంటుంది. ఇది సాధారణంగా వయస్సుతో పెరిగి వృద్దులలో వస్తుంది. కాంతిని సరిగ్గా చూడలేకపోవడం,  రంగుల విషయంలో గందరగోళం,  రాత్రి సమయంలో చూడటంలో ఇబ్బంది వంటివి కంటిశుక్లం వల్ల ఎదురయ్యే సమస్యలు.  కంటిశుక్లం దృష్టి లోపానికి గల ప్రధాన కారణాలలో ఒకటి.  ముఖ్యంగా వృద్దాప్యం వచ్చాక కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ కంటిశుక్లం గురించి చాలామంది చాలా అపోహల్లో ఉన్నారు.  ఈ అపోహల కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కంటిశుక్లం గురించి అందరూ నమ్మే అపోహల గురించి తెలుసుకుంటే..

శస్త్రచికిత్సకు ముందు కంటిశుక్లం ముదిరిపోయి ఉండాలా?

నేటికాలంలో కంటిశుక్లం శస్త్రచికిత్సకు కంటిశుక్లం ముదిరిపోయే దశకు చేరుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆలస్యం చేసేకొద్ది ఆపరేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. రోజువారీ జీవితం  ప్రభావితం అవుతుంది. పైగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే కంటిశుక్లం ఇంకా ముదరకముందే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య అంతగా ఉండదని వైద్యుల మాట.

 శస్త్రచికిత్స తర్వాత కంటిశుక్లం తిరిగి పెరుగుతుందా?

తెల్లని పొరగా మారిన లెన్స్ తొలగించి  దాని స్థానంలో కృత్రిమ లెన్స్ (ఐఓఎల్) అమర్చిన తర్వాత, కంటిశుక్లం తిరిగి రాదు. అయినప్పటికీ, పృష్ఠ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్ (పిసిఒ) అని పిలువబడే పరిస్థితి నెలలు లేదా సంవత్సరాల తరువాత రావచ్చు. దీనిని  లేజర్ విధానంతో సులభంగా చికిత్స చేయవచ్చు.

వృద్ధులకు మాత్రమే కంటిశుక్లం వస్తుందా?

వృద్ధాప్యంతో కంటిశుక్లం సర్వసాధారణం అయినప్పటికీ, డయాబెటిస్, గాయం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం, ధూమపానం,  జన్యు కారణాలు  వంటి కారకాల వల్ల  యువతలో కూడా  వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతో  కంటిశుక్లంతో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయట.

 కంటి చుక్కలు లేదా ఆహారంతో కంటిశుక్లం నయం చేయవచ్చా?

కంటి చుక్కలు, హెర్బల్ నివారణలు లేదా ఆహార మార్పులతో కంటిశుక్లం తిప్పికొట్టవచ్చు లేదా నయం చేయవచ్చనే వాదనకు క్లినికల్ ఆధారాలు లేవట.  కంటిశుక్లం రోగులలో దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స మాత్రమే సరైనది అని వైద్యుల మాట.

 కంటిశుక్లం శస్త్రచికిత్స ప్రమాదకరం లేదా బాధాకరంగా ఉంటుందా?

కంటిశుక్లం శస్త్రచికిత్స అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా నిర్వహించే సురక్షితమైన విధానాలలో ఒకటి. ఇది సాధారణంగా త్వరగా అయిపోతుంది.  అనస్థీషియా కింద జరుగుతుంది.  అసౌకర్యం కూడా తక్కువ.   కొద్ది రోజుల్లోనే  దృష్టి మెరుగుపడుతుంది.

రెండు కళ్ళకు ఒకేసారి శస్త్రచికిత్స చేయాలా?

కంటిశుక్లం శస్త్రచికిత్సలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల విరామంతో ఒకేసారి ఒక కంటికి చేస్తారు. మొదటి శస్త్రచికిత్స ఫలితాల ఆధారంగా మరొక కంటికి చికిత్సను చేయడానికి వైద్యులకు క్లారిటీ వస్తుంది.

కంటిశుక్లం ముదిరి దృష్టి పూర్తిగా కోల్పోయే వరకు ఆపరేషన్ చేయించుకోకూడదా?

కంటిశుక్లం ముదిరే వరకు ఉంటే అది లైఫ్ స్టైల్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే సర్జరీ చేయించుకుంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.

 కోలుకోవడానికి నెలలు పడుతుందా?

నేటి కాలంలో జరిగే కంటిశుక్లం చికిత్స నుండి కోలుకోవడానికి నెలల సమయం అవసరం లేదు.  తరచుగా ఒకటి లేదా రెండు వారాలలో సాధారణ జీవనశైలికి వచ్చేస్తారు.  ఇది వ్యక్తిని బట్టి మారే అవకాశం ఉంటుంది.

                             *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu