పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం చేస్తున్నామన్నారు.  రైతు కుటుంబాలకు తొలి విడత రూ.7,500 సాయం అందిస్తున్నామని ప్రకటించారు. రైతుల అకౌంట్లలో నేరుగా నగదు జమచేస్తామన్నారు. 

‘పెట్టుబడి సాయం అందించేందుకు రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం అందిస్తున్నాం. గతేడాది రూ. 6,534 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. ఇప్పుడు 49 లక్షల మంది రైతన్నలకు లబ్ధి చేకూరేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు భరోసా కింద రూ. 5500 నగదు రైతుల అకౌంట్‌లో జమ అవుతాయి. ఏప్రిల్‌లో 2 వేలు ఇచ్చాం.. ఇప్పుడు రూ. 5500 ఇస్తున్నాం. అక్టోబర్‌లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తాం. పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం చేస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.