ముఖ్యమంత్రికి కోప మొచ్చింది .. ఎందుకో?
posted on Jun 28, 2025 4:23PM
.webp)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు. ముఖ్యంగా సహచర మంత్రులపై గుస్సా అయిన సందర్భాలు అసలుకే లేవని చెప్పవచ్చును. మంత్రి వర్గ సమావేశాల్లోకానీ, బయట ఇతరత్రా కార్యక్రమాల్లో కానీ,మంత్రులు తనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుకున్నది కూడా లేదని అంటారు.
నిజానికి, ముఖ్యమంత్రి అందరిలో ఒకడిలా కలిసిపోతున్నారని, హుందాతనం రావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, నిజానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కిరీటాలు ఏమీ ఉండవు. మంత్రి వర్గంలో అందరూ సమానమే,అందులో ముఖ్యమంత్రిది మొదటి స్థానం,అంతే అంతకు మించి’ ముఖ్యమంత్రి మరో ప్రత్యేక ఏదీ ఉండదు. అయితే, అది సత్యమే అయినా వాస్తవం కాదు. వాస్తవంలో ముఖ్యమంత్రికి పెట్టని కిరీటంఉంటుంది, ఆయన మాటే శాసనం అన్నట్లు. పరిపాలన నడుస్తుంది. కానే, రేవంత్ రెడ్డి మాత్రం, కారణాలు ఏమైనా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు.
అందరిలో ఒకరిగానే మెలుగుతున్నారు. అదలా ఉంచితే, రేవంత్ రెడ్డి గడచిన 18 నెలల్లో ఎప్పుడు మంత్రులను మందలించిన సందర్భం లేదు, కానీ, ఈ మధ్య కాలంలో సీఎం స్వరంలో కొంత మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్‌ఛార్జ్ మంత్రులు వాటిపై దృష్టిపెట్టడం లేదని గుస్సా అయ్యారని, ఇలా అయితే, కుదరదని కొంచెం చాలా గట్టిగానేహెచ్చరించారని సమాచారం.
అలాగే, మంత్రులకు డూస్’ అండ్’ డోంట్స్’, (ఏమి చేయాలి, ఏమి చేయకూడదు)కు సంబదించి కూడా దిశా నిర్దేశం చేశారని, అందులో భాగంగా,. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యత అంతా ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవులు భర్తీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిజానికి, ఇక్కడ ముఖ్యమంత్రి ఏ ఒక్క మంత్రిని పేరు పెట్టి తప్పు పట్టలేదు.కానీ, ముఖ్యమత్రి, అందరినీ కాకుండా కొందరిని ఉద్దేశించి మాత్రమే, గుస్సా అయ్యారని, అందులో, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యులని పార్టీ వర్గాల సమాచారంగా, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నిజానికి, ఒకప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత మంత్రులలో పొంగులేటి పేరు ప్రముఖంగా వినిపించేది. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ఇదరి మధ్య దూరం పెరిగిందని అంటారు. నిజానికి, ఒక దశలో,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటిని, కీలక శాఖల నుంచి తప్పించే ఆలోచన చేశారని, ప్రచారం జరిగింది. అదొకటి అయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి తొందరపడి చేసిన ప్రకటన విషయంలోనూ పొంగులేటిని పీసీసీ చీఫ్’ మందలించి నట్లు వార్తలొచ్చాయి. అంటే కాకుండా, ఇటీవల కాలంలో పొంగులేటి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదులు చేరినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మూడు రోజుల క్రితం (బుధవారం) ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు.
ఇప్పడు ఈ భేటీ వ్యహారం పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా, కీలక నేతల స్థాయిలో చర్చనీయాంశం అయిందని అంటున్నారు. అంతే కాదు, పొంగులేటి ఢిల్లీ ఎందుకు వెళ్ళారుఅనే విషయంలో, విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పొంగులేటిని అధిష్ఠానమే పిలిచిందా? లేదంటే, తనపై వస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్’ను కలిసి తనపై చేసిన ఆరోపణలకు సంబదించి వివరణ ఇచ్చేందుకు ఆయనే ఖేర్గేను కలిశారా, అనే విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు. అయితే, అరిటాకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వెళ్లి అరిటాకు మీద పడినా చినిగి పోయేదే, ఆకుకే నష్టం, అలాగే, ఈయన వెళ్లి ఆయన్ని కలిసినా ఆయనే ఈయన్ని పిలిపించినా,జరిగేది అదే అంటున్నారు.
అయితే గంటకు పైగా జరిగినట్లు చెపుతున సమావేశంలో ఖర్గే, రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకెళ్లాలని పొంగులేటికి హితబోధ చేసినట్టు చెపుతున్నారు. అయితే ఢిల్లీ కోర్టుకు చేరిన పొంగులేటి పంచాయతీ’ ఇంతటితో ముగిసేది కాదని, ముందు ముందు కొత్త మలుపులు తిరిగినా,మరింతగా ముదిరిన ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఉక్కపోతను ఎక్కువ కాలం తట్టుకోవడం ఎవరికైనా కొంచెం చాలా కష్టం,సో.. పొంగులేటి వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు