మహా న్యూస్ ఛానెల్‌పై దాడి హేయమైన చర్య : పవన్ కళ్యాణ్
posted on Jun 28, 2025 3:55PM
.webp)
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదని డిప్యూటీ సీఎం తెలిపారు.
మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలని ఆయన పేర్కొన్నారు. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాని పవన్ అన్నారు. దాడికి బాధ్యులైన వారిని గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ సూచించారు.