కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్..శాసన సభలో చర్చించే దమ్ముందా?
posted on Jun 24, 2025 7:35PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బనకచర్లపై శాసన సభలో చర్చపెడతాం అన్ని ఆధారాలతో నేను వస్తా. మీరు సిద్దమా అని మాజీ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగలా మార్చేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. గతంలో వరి వేసుకుంటే ఉరేననే పరిస్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి, 48 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని, వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రాష్ట్రం నెత్తిన రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి వెళ్లారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం కూడా జరిగిపోయిందని విమర్శించారు.
"కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా తీస్తే వారంతా ఎలా సంపన్నులయ్యారు?" అని ఆయన ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. గ్రామాల్లో 'అమ్మ ఆదర్శ పాఠశాలలు' తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.