హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ పెట్టుబడి
posted on Apr 18, 2025 6:31PM

జపాన్ పర్యటనలోని ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకానమిక్ పార్ట్‌నర్ షిప్ రోడ్డు షోలో పాల్గోన్నారు. తెలంగాణలొ పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులను సాధించింది. రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది.ముఖ్యమంత్రి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.
విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్ ని ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్.. ఈరోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.