రాజ్యసభకు సీఎం రమేష్ క్షమాపణ
posted on Feb 19, 2014 2:07PM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న సందర్బంగా సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర సభ్యులు సభ మధ్యలోకి చేరుకొని సమైక్యనినాదాలతో, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ముందున్న సెక్రటరి జనరల్ తెలంగాణ బిల్లుకు సంబంధించి లోక్ సభ నుండి వచ్చిన పేపర్లను చదవబోతుండగా వెనుకనే ఉన్న సీఎం రమేష్ ఆయన మీద పడి లాక్కున్నారు. దీనిని డిప్యూటీ చైర్మన్ కురియన్ తప్పుపట్టారు. ఈ సంఘటన జరిగిన వెంటనే రాజ్యసభను రెండు గంటల వరకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి మొదలుకాగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభకు క్షమాపణలు చెప్పారు."రాష్ట్ర విభజన అత్యంత భావోద్వేగమైన అంశం. అందుకే అలా వ్యవహరించాను. సెక్రటరీ జనరల్ నుంచి కాగితాలు లాక్కున్నందుకు క్షమాపణ చెబుతున్నాను" అని సి.ఎం.రమేశ్ సభా ముఖంగా తెలిపారు.