వరాల విషయంలో చంద్రబాబు కంటే కేసీఆరే బెస్ట్ అంట..

ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అభివృద్ధిలో ఎంత కృషి చేస్తున్నారో అందరి తెలిసిందే. ఎవరి పాలన వారిది అయినప్పటికీ ఇద్దరి ఆశయం మాత్రం ఒక్కటే రాష్ట్రాభివృద్ది. అలాంటప్పుడు సహజంగానే ఇద్దరి పాలనను పోల్చి చూస్తారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా మిగలగా.. ఆంధ్రా మాత్రం ఆర్ధిక లోటుతో మిగిలింది. దీంతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాల మీద వరాలు కురిపించేవారు. కానీ చంద్రబాబు పరిస్థితి వేరు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు కంటే కేసీఆరే ఎక్కువ వరాలు ఇస్తాడు అన్న ముద్ర పడిపోయింది. ఇది మరోసారి నిజం చేశారు ఈ తెలుగు చంద్రులు. ఈ రోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పోలీసులకు వరాల జల్లు కురిపించారు. పోలీసులకు ప్రోత్సాహాకాలు, ప్రమోషన్లు ఇస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా ఎస్. ఐ ఆపై ఉన్నతాధికారులకు వారు విధులు నిర్వహించే చోట ఇళ్ల స్థలాలను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు వాటి రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయింపు ఇస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులకు 35 శాతం అలవెన్స్ లను ప్రకటించారు. పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్సును సైతం రూ.3500 నుంచి రూ.7వేల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా చంద్రబాబు విజయవాలో పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ లాగ వరాలైతే ఏం కురిపించలేదు కాని నాలుగు మాటలు చెప్పి పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కేసీఆర్ ఇచ్చిన వరాలను చూసి ఏపీ పోలీసులు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల వరాల మీద ఓ ఏపీ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఎంతైనా కేసీఆర్.. కేసీఆరే... చంద్రబాబు.. చంద్రబాబే అని అన్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu