దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ సంస్కరణలు దిక్సూచి : సీఎం చంద్రబాబు
posted on Sep 18, 2025 5:33PM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. సంస్కరణలు అంటే నేనప్పుడు ముందుంటాను. అభివృద్ధికి కృషి చేస్తేనే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించకుండా సంక్షేమం ఇవ్వడం సరికాదు. అప్పులు చేసి సంక్షేమం పంచడం సమంజసం కాదు, అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగాయని గుర్తుచేశారు. వన్ నేషన్ – వన్ విజన్ అడుగులు వేస్తున్నామని, దేశం–రాష్ట్రం ప్రాధాన్యమని తెలిపారు.
గతంలో 4 టైర్ల పన్ను వ్యవస్థ (5%, 12%, 18%, 28%) ఉండేదని, ఇప్పుడు 5% మరియు 18% శ్లాబులతో సరళతరం చేశారని వివరించారు. పండుగల వేళ వినియోగం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ సంస్కరణల ఫలితంగా పరోక్ష పన్ను చెల్లింపుదారులు 2017లో 65 లక్షల నుంచి ప్రస్తుతం 1.51 కోట్లకు పెరిగారని, జీఎస్టీ రిసిప్టులు 2018లో రూ.7.19 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.22.08 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, వన్ నేషన్ – వన్ విజన్ నినాదంతో భారత్ డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించే దేశంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.