పార్టీ పెద్దలపై విరుచుకుపడ్డ డికె అరుణ
posted on Mar 24, 2012 12:53PM
హైదరా
బాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలపై మంత్రి డికె అరుణ మండిపడ్డారు. సిఎల్పి కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ పెద్దల విమర్శల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సీనియర్లు చేస్తున్న విమర్శలు పార్టీని బలహీనపరిచే విధంగా ఉన్నాయని, పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచే విధంగా వ్యహరించాలి తప్ప పరస్పరం విమర్శలు చేసుకుంటూ బలహీనపరిచే పని చేయడం సరి కాదని ఆమె అన్నారు. సీనియర్ నేతలు ప్రచారానికి కూడా రాకుండా ఫలితాలు వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి విడుదల చేసిన సర్వే ఫలితాలపైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలపై సర్వే రిపోర్టులు ప్రకటించారు, క్రమశిక్షణ ఎవరిని చూసి నేర్చుకోవాలని ఆమె లగడపాటి రాజగోపాల్‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ని విశ్వసించలేదని చెప్పారు. ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తుందని తెలియజెప్పవలసిన అవసరం ఉందన్నారు. పార్టీని రోడ్డుమీద వేయకుండా మళ్లీ వచ్చే ఉప ఎన్నికలలో అందరూ కలిసి కృషి చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
పార్టీ పార్లమెంటు సభ్యులు, సీనియర్లు తెలంగాణ తెచ్చేది ఇచ్చేది తామేనని చెప్పి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సి ఉండిందని ఆమె అన్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యమని ఆమె అన్నారు. తాము ఎన్నికల్లో కష్టపడుతుంటే సీనియర్లు కాంగ్రెసు ఓడిపోతుందని ప్రకటనలు చేశారని ఆమె తప్పు పట్టారు. కాంగ్రెసులో ఉంటూ వేరే పార్టీకి మద్దతుగా మాట్లాడారని ఆమె విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెసుకు 43 వేల ఓట్లు రావడం చిన్న విషయమేమీ కాదని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో కన్నా ప్రస్తుతం తెరాస తరఫున పోటీ చేసిన జూపల్లి కృష్ణా రావుకు 375 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని ఆమె చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా వారిని మభ్య పెట్టి తెలంగాణవాదంతో గెలవాలనే స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించినవారి వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని ఆమె అన్నారు.