తెలంగాణా నాయకులు వై.ఎస్. కు అమ్ముడుపోయారు తెలుగువన్.కామ్ ఇంటర్వ్యూలో... పాల్వాయి
posted on Mar 24, 2012 3:03PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్ ఒకరు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. పదవుల కోసం తానెప్పుడు వెంపర్లాడలేదని ఆయన తరచు అంటుంటారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సీటు కోసం కొట్లాది రూపాయలు కుమ్మరించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తమకు అప్రయత్నంగానే ఆ సీటు దక్కిందని పాల్యాయి అంటున్నారు. ఆయన తెలుగువన్.కామ్ ప్రతినిధితో మాట్లాడుతూ తాను గాని, రాపోలు ఆనంద భాస్కర్ గానీ రాజ్యసభ సీట్ల కోసం ఎటువంటి ప్రయత్నాలు, పైరవీలు చేయలేదని, కోట్లు కుమ్మరించే స్థోమత తమ ఇద్దరికీ లేదని అయినా అధిష్టానం తమ సేవలను గుర్తించి రాజ్యసభకు పంపిందని అన్నారు.
కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలకు ఇది సంకేతమన్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికైన సి.ఎం. రమేష్, దేవేందర్ గౌడ్ లు కోటీశ్వరులు, వారు ఈ పదవుల కోసం సుమారు వంద కోట్లు కేటాయించినట్లు టి.ఆర్.ఎస్. నాయకుడు కె.టి.ఆర్ ఆరోపిస్తున్నాడు. పేదల కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ కోటీశ్వరులనే రాజ్యసభకు పంపింది. కానీ కాంగ్రెస్ పార్టీమాత్రం మాలాంటి పైసాకు ఠికానా లేని పేదోళ్ళను కూడా రాజ్యసభకు పంపింది. అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అన్నారు పాల్వాయి గోవర్ధన్. గతంలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. నాయకులు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అమ్ముడుపోయారని అందుకే తెలంగాణా ఉద్యమం బలహీన పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా తెలంగాణాను తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు. రాజ్యసభలో తాను తెలంగాణావాణిని గట్టిగా వినిపిస్తానని పాల్వాయి గోవర్ధన్ చెప్పారు. తాను కరడు గట్టిన తెలంగాణా వాదినని అధిష్టానానికి తెలిసినప్పటికీ తనను రాజ్యసభకు పంపిందని, దీనిని బట్టి చూస్తే తెలంగాణా అంశంపై అధిష్టానం సుముఖంగా ఉందని అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.