యడ్యూరప్ప ఫై కమలనాథులకు గౌడ ఫిర్యాదు !

కర్ణాటక: తన నమ్మినబంటుగా ముద్రపడిన ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడ కూడా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు  ఝులక్ ఇచ్చారు.దీన్ని బట్టి యడ్యూరప్పకు కాలం కలిసొచ్చినట్టు కనిపించడం లేదు.  ముఖ్యమంత్రి దర్పాన్ని అనుభవిస్తున్న సదానంద ఇపుడు ఆ పీఠాన్ని వదులుకునేందుకు ససేమీరా అంటున్నారు. పైపెచ్చు తన విధులకు తీవ్ర ఆంటంకం కలిగిస్తున్నారని అందువల్ల యడ్యూరప్పను కట్టడి చేయాలంటూ కమలనాథులకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

భూకుంభకోణంలో చిక్కుకుని ఇటీవలే బెయిల్‌పై విడుదలైన యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందుకోసం తన నమ్మినబంటు సదానంద గౌడను సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు ఆరంభించారు.ఈ విషయం తెలుసుకున్న బీజేపీ అధిష్టానం సదానంద గౌడతో ఎంపీ పదవికి రాజీనామా చేయించింది. అదే సమయంలో యడ్యూరప్పపై నమోదైన కేసులన్నింటి నుంచి నిష్కళంకుడుగా బయటపడేంత వరకు సీఎంని చేసేది లేదని తేల్చి చెప్పింది. పైపెచ్చు ముఖ్యమంత్రి సదానందకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందేనని, లేనట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరిక చేసింది. ఈ హఠాత్పరిణామంపై యడ్యూరప్ప శిబిరం భగ్గుమంది.

మరోవైపు.. స్పీకర్‌ మీరాకుమార్‌కు రాజీనామా సమర్పించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం సదానంద గౌడ పార్టీ అగ్రనేతలతో సమావేశమై మంతనాలు జరిపారు. యడ్యూరప్ప తనను స్వేచ్ఛగా పని చేయనివ్వడం లేదని మొరపెట్టుకున్నట్టు సమాచారం. యడ్యూరప్ప వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, అగ్రనేత అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu