జైళ్లో సిద్ధూకు గుమాస్తా ట్రైనింగ్ !

సిక్సర్ల సిద్ధూగా క్రికెట్ అభిమానులను అలరించిన నవజోత్ సింగ్ సిద్ధు ఆ తరువాత రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. తన దైన వాగ్ధాటితో పంజాబ్ రాజకీయాలలో అగ్రతారగా ఎదిగాడు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. అయితే ఇటీవలి పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పాలవడంతో ఆ ఆశలు నెరవేరలేదు. ఈ లోగా 1988 నాటి కేసులో సిద్ధూకు కోర్టు జైలు శిక్ష విధించింది.  1988లో రోడ్డుపై జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరచి, అతడి  మరణానికి కారణమైనందుకు సిద్ధూకు సుప్రీంకోర్టు   ఏడాది  జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ నెల 19న సుప్రీం తర్పు రాగా, ఆ మరుసటి రోజు సిద్ధూ పాటియాలా కోర్టులో లొంగిపోయాడు. జైలులో సిద్ధూకు ఒక ప్రత్యేక టాస్క్ అప్పగించారు జైలు అధికారులు. అందుకోసం ఆయనకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇంతకీ జైల్లో సిద్ధూకు అప్పగించిన ఉద్యోగం కాని ఉద్యోగం ఏమిటో తెలుసా గుమాస్తా గిరీ.  కోర్టు తీర్పులను వివరించడం, జైలు రికార్డులను మెయింటైన్ చేయడమే ఆయన పని.

ఇందు కోసం సిద్ధూకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత ఆయన చేసే పనికి రోజుకింతని వేతనం కూడా ఇస్తారు.  అతని స్కిల్ ను బట్టి రోజుకు 40 రూపాయల నుంచి 90 రూపాయల వరకూ వేతనం చెల్లిస్తారు.