ఒంగోలును ముంచెత్తిన జన సునామీ- ఏపీ రోడ్లన్నీ మహానాడుకే!

ఒంగోలుకు జనం పోటెత్తారు.. వందల్లో, వేలల్లో కాదు లక్షల్లో అవధులు లేని ఉత్సాహంతో మహానాడుకు తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో ఒంగోలు పట్టణం కక్కిరిసి పోయింది. ఒంగోలుకు తరలి వస్తున్న జన ప్రవాహాన్ని చూసేందుకు ఒంగోలు ప్రజ ఒక్కుదుటన రోడ్ల పైకి వచ్చారు. దీంతో ఒంగోలులో ఏ వీధి చూసినా ఇసుక వేస్తే రాలనంత మంది జనం కనిపిస్తున్నారు. దీంతో ఒంగోలు పట్టణం ఉక్కిరి బిక్కిరైపోయింది.

గురువారం సాయంత్రం నుంచే ఒంగోలుకు జన ప్రవాహం ఆరంభమైంది. నిముష నిముషానికీ అది పెరిగి ఒంగోలును జన సునామీ ముంచెత్తిందా అనిపించేలా పోటెత్తింది. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహాన్ని చూసేందుకు ఒంగోలు ప్రజలంతా బయటకు వచ్చి బారులు తీరింది, బయటకు రావడానికి కూడా కాలుమోపేంత స్థలం లేకపోవడంతో మిద్దెలెక్కి కూడా జనం తెలుగు తమ్ముళ్లకు స్వాగతం పలికారు. ఈ జన ప్రవాహాన్ని, జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ సర్కార్ తప్పు చేశామన్న బాధతో మెలికలు తిరిగిపోతున్నది.

మహానాడుకు తెలుగుదేశం కోరినట్టు స్టేడియం గ్రౌండ్ ఇచ్చేసి ఉంటే బాగుండేదని బాధపడిపోతోంది. అలా ఇచ్చినట్లైతే మహానాడుకు ఇంతటి జన ప్రవాహం వచ్చి ఉండేది కాదని ఇప్పుడు పశ్చాత్తాప పడుతోంది. స్టేడియం గ్రౌండ్ లో ఎక్కువలో ఎక్కువ 40 వేల మందికి సరిపడా స్థలం ఉంటుంది. కానీ సర్కార్ గ్రౌండ్ నిరాకరించడంతో రగిలిపోయిన ఒంగోలు రైతాంగం మహానాడు నిర్వహించుకునేందుకు స్వచ్ఛందంగా లక్షల మంది పట్టే స్థలం ఇచ్చింది. అలాగే మహానాడుకు బస్సులను అందకుండా చేసి తప్పు చేశామని కూడా ఇప్పుడు జగన్ బ్యాచ్ బాధతో గిలగిలలాడిపోతోంది.

బస్సులు అందుబాటులో లేకుండా చేయడతో కసి పెరిగిన తమ్ముళ్లు కార్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్లు, మూడు చక్రాల వికలాంగుల వాహనాల్లో కూడా ఒంగోలు బాట పట్టారు. అది చూసి మహిళలూ, వృద్ధులూ, వారితో పదం కలిపి తటస్థులూ ఇలా రాష్ట్రం నలుమూలల నుంచీ ఒంగోలు వైపు జనం ఒక మహా ప్రవాహంలా కదిలారు. కదంతోక్కారు.