సీజేఐ పేరుతో ఫేక్ ట్వీట్ ఖాతా! పోలీసులకు జస్టిస్ ఎన్వీ రమణ ఫిర్యాదు
posted on Apr 26, 2021 7:57PM
సోషల్ మీడియాలో ఫేక్ బాగోతం దారుణంగా తయారైంది. ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి పేరుతోనే నకిలీ ఖాతా స్పష్టించారు కేటుగాళ్లు. తన పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్టులు వస్తున్న విషయాన్ని గుర్తించిన సీజేఐ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్‌లో తన పేరిట నకిలీ ఖాతా సృష్టించి పోస్టులు పెడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీజేఐ పేరుతో పేక్ ఖాతా పెట్టిన ఫేక్ వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి ఈ ఫేక్ ఖాతాలో చేసిన ఓ పోస్టు వివాదాస్పదంగా ఉండడంతో జస్టిస్ ఎన్వీ రమణ వెంటనే అప్రమత్తమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
‘‘జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నెరిపిన దౌత్యంతోనే అమెరికా భారత్‌కు ముడిపదార్థాలు పంపాలని నిర్ణయించుకుంది’’ అంటూ పీఎంఓను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు 98 సార్లు ఈ నకిలీ ఖాతా నుంచి వివిధ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ఈనెల 24న సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.