చిరు కు త్వరలో కేంద్రమంత్రి పదవి?
posted on Jul 26, 2012 12:40PM
రాజ్యసభ సభ్యుడు,మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రి అవటం ఖాయం అని వార్తలొస్తున్నాయి. దీంతో పీఆర్పీ విలీనం అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అవుతుందంటున్నారు. అయితే కేంద్రంలో మంత్రి పదవికి ప్రణబ్‌ముఖర్జీ రాజీనామా చేయటం, మరికొన్ని ఖాళీలు ఉండటంతో రాష్ట్రం నుంచి కనీసం ముగ్గురికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చిన తెరాస నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణా ఇవ్వకపోయినా మంత్రిపదవుల ద్వారా వారిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని అథిష్టానం భావిస్తోంది.
ప్రత్యేకించి బయట నుంచి మద్దతు ఇచ్చిన తెరాస ఇప్పుడు మంత్రుల ద్వారా లోపలికి ఆహ్వానించాలని కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. కొత్త మంత్రులతో పాటు కాంగ్రెస్ జాతీయప్రధానకార్యదర్శి రాహుల్‌గాంథీ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తోంది. తిరుపతి ఎన్నికల్లో ఓటమి తరువాత చిరంజీవి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కదనుకుని మౌనంగా ఉన్నారు. అంతేకాకుండా తమ గొప్పదనాన్ని చాటేందుకు ప్రయత్నించి భంగపడ్డ చిరుకు ఈ మంత్రి పదవి ఓ మంచి అవకాశమని పలువురు భావిస్తున్నారు. ఈ పదవి ద్వారా ఏమైనా చేస్తేనే ఆయనకు కాంగ్రెస్ తగిన గుర్తింపు ఇస్తుందన్నది మాత్రం ఆ పార్టీపెద్దలు తేల్చేస్తున్నారు.