రాజకీయంగా చిరు యాక్టివ్.. జగన్ తీరే కారణమా?

చిరంజీవి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారా? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కొంత ఇన్ యాక్టివ్ గా కనిపించిన ఆయన రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యమధ్యలో ఏదో సినిమా డైలాగుల్లో మాత్రమే ఆయన రాజకీయంపై వ్యాఖ్యలు చేశారు తప్ప క్రియాశీలంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొన్నది లేదు. పలు సందర్భాలలో ఆయన తాను రాజకీయంగా తటస్థంగా ఉంటానని స్వయంగా చెప్పారు కూడా. 

అందుకు అనుగుణంగానే తన సోదరుడు పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో కానీ,   2019 ఎన్నికలలో  జనసేన పోటీ చేసిన సమయంలో కానీ ఎన్నడూ పవన్ కల్యాణ్ కుమద్దతుగా మాట్లాడింది లేదు. ఆయన పార్టీ కోసం ప్రచారం చేసిందీ లేదు.  అయితే ఆశ్చర్యకరంగా ఇటీవల ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా వార్తలలో నిలవడానికి, ఆసక్తిని దాచుకోకుండా బహిర్గతం చేయడానికి ఏపీ సీఎం జగనే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి సన్నిహితులు అలాగే పరిశీలకులు సైతం ఏపీలోని జగన్ సర్కార్ కారణంగా తెలుగుసినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడటమే కాకుండా స్వయంగా చిరంజీవి స్థాయిని తగ్గించేలా సీఎం వ్యవహరించిన తీరే చిరు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావడానికి కారణమని అంటున్నారు. 

 చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ప్రముఖులు జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాటి ఘటనను గుర్తు చేస్తూ ఇప్పుడు చిరంజీవి పొలిటికల్ యాక్టవిటీకి లింకు పెట్టి విశ్లేషణలు చేస్తున్నారు.  అప్పట్లో జగన్ క్యాంపు కార్యాలయానికి కొద్ది దూరంలోనే తన  కారును నిలిపివేసి నడిపించడం, ఆ తర్వాత సమావేశంలో కూడా జ  జోడించిన సమయంలో జగన్ ప్రత్యభివాదం చేయకపోవడం గుర్తు చేస్తూ.. ఆ అవమానాన్ని ఇంత వరకూ పంటి బిగువున భరించిన చిరంజీవి ఇప్పుడు మరో సారి జగన్ అధికారంలోకి రాకూడదన్న బలమైన ఆకాంక్షతోనే   చిరు రాజకీయ కార్యకలాపాల ద్వారా తన మద్దతు ఎవరికో సంకేతాలు ఇస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.