అన్నను నెట్టేసి తాళి కట్టిన తమ్ముడు..
posted on Jun 2, 2017 4:36PM
.jpg)
తమిళనాడులో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అన్నను పక్కకు నెట్టేసి తమ్ముడు తాళి కట్టాడు. వివరాల ప్రకారం... తమిళనాడులోని వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన కామరాజ్‌కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే రాజేష్ కు ఈ మధ్యే మదురైకి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. ఇక ఈనేపథ్యంలోనే ఇలవంపట్టి వెన్‌కల్ ప్రాంతంలోని మురుగన్ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి అబ్బాయి తరపు.. అమ్మాయి తరపు బంధువులు అందరూ వచ్చారు. ఇక ముహూర్తం రాగానే వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పురోహితులు మంగళసూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని ఇచ్చాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తాళి కట్టబోయే తన అన్నను తమ్ముడు వినోద్ పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు. దీంతో అక్కడ ఉన్న రాజేష్ తో పాటు తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. కొంత సేపటికి తేరుకొని వినోద్ ను కొట్టగా అసలు విషయం బయటపడింది. వినోద్‌ను, వధువును విచారించగా రాజేష్‌కు పెళ్లి చూపులు చూస్తుండగానే వినోద్, వధువు ఇద్దరూ ప్రేమించుకున్నారని చెప్పడంతో అందరూ షాకయ్యారు.