కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ తప్ప ఏమీ కట్టలేదు

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్‌ కలిశాయని, దేశం కోసం కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజాకూటమి పేదవాళ్ల కోసం ఏర్పాటు చేసిన కూటమని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జైల్లో పెడుతోందని విమర్శించారు. ఎక్కడ మీటింగ్‌లు పెట్టినా టీఆర్‌ఎస్‌కు తానే కనిపిస్తున్నానని, తనను విమర్శించడం తప్ప వారికి వేరే పనిలేదని ఆయన మండిపడ్డారు. బాగా పనిచేస్తున్నానన్న అసూయతో తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలుగువారి కోసం దూరదృష్టితో ఒక విజన్‌ ఇచ్చానన్నారు. ఆధునికమైన నగరానికి శ్రీకారం చుట్టామని, టీడీపీ కార్యక్రమాలను కాంగ్రెస్‌ కొనసాగించిందన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ తప్ప ఏమీ కట్టలేదని చంద్రబాబు విమర్శించారు. ట్యాంక్‌బండ్‌కు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్‌ అని అన్నారు.

కేసీఆర్‌కు ఓట్లు లేవు కానీ.. డబ్బుల మూటలున్నాయని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో అన్ని స్థానాల్లో గెలుస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని అన్నారు. ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్‌ చేస్తారని సమాచారం ఉందని, డబ్బు, ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయతీగా ఓటేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తెలుగువారి మధ్య తాను చిచ్చు పెట్టడం లేదని చంద్రబాబు అన్నారు. తెలుగువారి అభివృద్ధి కోసమే తాను పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం లేకపోతే కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశంలో నెంబర్‌ వన్‌ కావాల్సిన తెలంగాణ అప్పులపాలైందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలతో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని, సంవత్సరానికి 6 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.