తాండవ నదితో ఏలూరు కాల్వల అనుసంధానం.. నారాయణ మూర్తిని నమ్మించి మోసం చేసిన జగన్!

మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు. అందుకే జగన్ తాజా ఎన్నికల మేనిఫెస్టో గురించి కనీసం పట్టించుకోవడం లేదనీ, ఆయన నవరత్నాలు ప్లస్ ను నమ్మడంమే లేదనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ తన మేనిఫెస్టో గురించి మాట్లాడటం మానేసి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ మాటతప్పి, మడమ తిప్పిన మరో అంశం ఇప్పుడు  సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అదీ నటుడు, దర్శకుడు నారాయణ మూర్తికి ఇచ్చిన మాట కావడం విశేషం. 

సామాజిక సమస్యలపై సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించే నటుడు ఆర్. నారాయణ మూర్తిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వామపక్ష భావజాలంతో ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో తన సినిమాలలో పరిష్కారం చూపుతారు. సీనీ పరిశ్రమలో అజాత శత్రువుగా, అందరి మనిషిగా గౌరవాన్ని పొందే ఆర్. నారాయణ మూర్తిని కూడా జగన్ నమ్మించి వంచించారు. అదీ ఒక రోజో, నెలరోజులో కాదు.. ఏళ్ల తరబడి ఆర్. నారాయణ మూర్తి జగన్ చెప్పింది చేస్తారన్న నమ్మకంతో ఉన్నారంటే జగన్ ఆయనను ఎంతగా నమ్మించారో అర్థమౌతుంది. ఇంతకీ విషయమేమిటంటే .. నారాయణ మూర్తి జగన్ వద్దకు ఒక ప్రతిపాదన తీసుకువెళ్లారు. అదేమిటంటే ఏలూరు కాలువలను  విశాఖ తాడవ నదితో అనుసంధానం చేస్తే రెండు జిల్లాల్లోనూ 56 వేల ఏకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రతిపాదనకు జగన్ వెంటనే ఆమోదం తెలిపేశారు. 2021 మార్చిలో ఈ ప్రాజెక్టు కోసం జగన్ ప్రభుత్వం 470 కోట్లు కూడా మంజూరు చేసింది. టెండర్లనూ పిలిచింది.

దీంతో నారాయణమూర్తి దేశంలోనే ఇలాంటి మంచి సీఎం ఎక్కడా లేరంటూ ప్రశంసలు గుప్పించేశారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో పనిలేదని, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. దేశంలోనే జగన్ లా ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న సీఎం మరొకరు ఉండని వేనోళ్ల పొగిడేశారు. 

అయితే ఆర్భాటమే తప్ప ఆచరణ ఉండదని జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో మరో సారి రుజువు చేసుకుంది. ప్రాజెక్టుకు అనుమతించిన మూడేళ్ల తరువాత కూడా ఇప్పటి వరకూ కనీసం శంకుస్థాపన జరగలేదు. ఈ ప్రాజెక్టు పూర్తిగా కాగితాలకే పరిమితమైంది. తత్వం బోధపడిన నారాయణ మూర్తి మౌనం వహించారు. తాను గతంలో జగన్ పై కురిపించిన పొగడ్తల వర్షం ఎవరికీ గుర్తుండకుండా ఉంటే బాగుండునని భావించడమే ఈ మౌనానికి కారణం అయ్యుండొచ్చు. కానీ నెటిజనులు మాత్రం జగన్ మోసాల జాబితాలో తాండవ నదితో ఏలూరు కాల్వల అనుసంథానం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేరిపోయిందంటూ మరోసాని జగన్ సర్కార్ వైఫల్యాలు, మోసాల జాబితాను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు.