ఉపాధ్యాయులు రివెంజ్ కు రెడీ అయిపోయారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఐదు లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఏ విధంగా చూసినా రికార్డే. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఎన్నికలలోనూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేందుకు లక్షా లక్షన్నర మంది కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ సారి మాత్రం ఉద్యోగులలలో తమ ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తోంది.

సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్దగా సుముఖత చూపరు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలంటూ నియోజకవర్గ కేంద్రానికి లేదా మండల కేంద్రాలకు కానీ వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది.  అయితే ఈసారి ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల కోసం  కేంద్ర ఎన్నికల సంఘం 7, 8 తేదీలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. ఫారం 12ను సమర్పించి 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. దీంతో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పొందే విషయంలో అవరోధాలు, ఇబ్బందులు ఎదురౌతున్నా పట్టించుకోకుండా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి తమ ఓటు హక్కును వినియోగించుకుతీరాలన్న సంకల్పం వారిలో కనిపించింది.

ఈ పట్టుదల, సంకల్పం  వెనుక జగన్ ను గద్దె దించాలన్న తపన కూడా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో  ఉద్యోగులు, మరీ ముఖ్యంగా టీచర్లను అన్ని విధాలుగా వేధింపులకు, అవమానాలకు గురి చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాన్న వాగ్దానాన్నివిస్మరించడం విషయంలో కానీ, వారికి చట్టబద్ధంగా, న్యాయపరంగా అందాల్సిన అలవెన్సులు, సబ్బిడీల విషయంలో కానీ జగన్ ఏ మాత్రం సానుకూలత లేకుండా వ్యవహరించారు.  ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది తెలుగుదేశం కూటమికే ఓటు వేయడానికి నిర్ణయించేసుకున్నట్లుగా వారి వాట్సాప్ గ్రూపులలో సంభాషణలు, చర్చల ఆధారంగా వెల్లడౌతోంది. ఉద్యోగులు, టీచర్లు తన ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలన్న ప్రచారం కూడా టీచర్ల వాట్సాప్ గ్రూపులలో పెద్ద ఎత్తున జరుగుతోంది. 

 ఫలానా పార్టీ, ఫలానా కూటమికి ఓటు అని ప్రత్యేకంగా చెప్పకున్నప్పటికీ, స్పష్టంగా అధికార పార్టీకి వ్యతిరేకం అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాది.  న భూతో అన్నట్లుగా టీచర్లు చురుకుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న తీరు మాత్రం జగన్ సర్కార్ తో వారు ఎంతగా విసిగిపోయారో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.