మాపై కోపమున్నా ఈ సారికి గెలిపించండి: తుమ్మల

 

ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన పలువురు టీఆర్ఎస్ నేతలకు నిరసన సెగలు ఏ రేంజ్ లో తగిలాయో తెలిసిందే. నిరసన సెగ తగిలిన వారిలో అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ముందు వరుసలో ఉంటారు. ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లో ప్రజలు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో ఈసారి ఆయన గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా ఆయన గెలుపు కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా తాటి వెంకటేశ్వర్లుకు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. 'నాపై, ఎమ్మెల్యే అభర్థి తాటిపై, ఎంపీ పొంగులేటిపై కోపం, అసహనం ఉన్నా.. ఎన్నికల తర్వాత చూపించాలన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఆ కోపాన్ని ప్రదర్శించొద్దని.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నాక కూర్చుని మాట్లాడుకుందాం' అని తుమ్మల వ్యతిరేక వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. జిల్లా ప్రజల కోసం తన 32 ఏళ్ల రాజకీయ జీవితాన్ని త్యాగం చేసానని అన్నారు. కాబట్టి నాకోసమైనా తాటి వెంకటేశ్వర్లును గెలిపించాలని కోరారు. భారీ మెజారిటీతో కాకపోయినా ఐదు లేదా పదివేల మెజారిటోనైనా గెలిపించాలని తుమ్మల కోరారు. మరి తుమ్మల కోరికను ప్రజలు ఎంతవరకు మన్నిస్తారో చూడాలి.