పాదయాత్ర కష్టాలు..బాబు కన్నీళ్లు
posted on Mar 19, 2013 5:44PM

నేడు పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు పోలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీకి చెందిన సీనియర్ నేత గరికపాటి రామ్మోహన రావు కార్యకర్తలకు బాబు పాదయాత్ర కష్టాలు ఏకరువు పెట్టారు. ఎంత కష్టంగా ఉన్నప్పటికి బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆయన కష్టాలను తాము కళ్లారా చూస్తున్నామని, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు తల్లి బతికి ఉండి ఉంటే ఆయన పాదయాత్రను చూసి కన్నీళ్లు పెట్టేదని అన్నారు.
అరవై నాలుగేళ్ల వయస్సులో చంద్రబాబు సాహసం చేస్తున్నారని, ఆయన ఎవరి కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారో ప్రజలు, కార్యకర్తలు గుర్తించాలని గరికపాటి రామ్మోహన రావు అన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. అయినా, ఆయన ప్రజల కోసం ఇదంతా చేస్తున్నారన్నారు. గరికపాటి మాటలు కార్యకర్తలను, నేతలను ఉద్వేగానికి గురి చేశాయి. వేదిక పైనున్న చంద్రబాబు కూడా గరికపాటి మాటలకు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరగడం చూసిన కార్యకర్తలు మరింత ఉద్వేగానికి గురయ్యారు.