కోడెల సూసైడ్ ఓ కేస్ స్టడీ... నన్నే బెదిరిస్తారా?... జగన్ సర్కార్ పై బాబు నిప్పులు

రాజకీయ వేధింపులకు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు దేశంలోనే కోడెల సూసైడ్ ఒక కేస్ స్టడీ అన్నారు చంద్రబాబు. చేయని తప్పుకు ఒక నాయకుడిపై ఎలా రాజకీయ వేధింపులకు పాల్పడ్డారో... కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారో... కోడెల కేసు ఒక ఉదాహరణ అన్నారు. కోడెల ఆత్మహత్య, రాజకీయ వేధింపులు, టీడీపీ నేతలపై వరుస కేసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు... జగన్ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. కావాలనే కోడెలపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. ఫర్నిచర్ తీసుకెళ్లమని కోడెల ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా, దొంగతనం అభియోగం మోపడంతోనే అవమానం భరించలేక కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. స్పీకర్, మంత్రుల కార్యాలయాల్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉండటం సహజమని, ప్రభుత్వం మారితే, వాటిని తిరిగి తీసుకుంటుందని, కానీ జగన్ సర్కారు ... కోడెల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. కేవలం మూడే మూడు నెలల్లో కోడెల కుటుంబంపై 18 కేసులు పెట్టారన్న చంద్రబాబు.... పోలీసులను మేనేజ్ చేసి... నాన్ బెయిలబుల్ సెక్షన్లు జతచేశారని ఆరోపించారు. కోడెల కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ ఉండటం తప్పయితే, మరి వైఎస్ చనిపోయాక, కుటుంబం మొత్తం నెలల తరబడి ఉండటం సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉండటం నేరం కాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అంటే మీరు చేస్తే ఒప్పు... ఇతరులు చేస్తే తప్పా అంటూ జగన్ ను నిలదీశారు. కేవలం కేసులతోనే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా కోడెలపై తప్పుడు ప్రచారంచేసి వేధించారని బాబు మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లుగా కేసులు పెట్టి అత్యుత్సాహం చూపించారని చంద్రబాబు ఆరోపించారు. కోడెల మాదిరిగా టీడీపీ నేతలందర్నీ మట్టుబెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్న చంద్రబాబు... ప్రభుత్వ వేధింపులపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే కేంద్ర హోంమంత్రిని, అట్రాసిటీ కేసులపై ఎస్సీఎస్టీ కమిషన్లను కలుస్తామని బాబు తెలిపారు.

అయితే, చంద్రబాబుపై మంత్రి బొత్స మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట... ప్రతిపక్షంలోకి వచ్చాక మరో మాట... మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుకు కౌంటరిచ్చారు. పనికిమాలిన వ్యవస్థ అంటూ నిందించిన చంద్రబాబు... ఇప్పుడు అదే గవర్నర్‌ను ఏ ముఖం పెట్టుకుని కలిశారని ప్రశ్నించారు. ఇక సీబీఐని ఏపీ పొలిమేరకు కూడా రావొద్దన్న బాబు... ఇప్పుడు సీబీఐ విచారణకు ఎలా డిమాండ్ చేస్తారని నిలదీశారు. కోడెల మృతిపై రాజకీయంచేసి లబ్దిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, మరి కోడెల బతికుండగా ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పట్టించుకోకపోవడంతోనే కోడెల బీజేపీలోకి వెళ్లాలనుకున్నారని, ఇది నిజం కాదా అన్నారు. కోడెల మొబైల్ మిస్సైందంటున్నారని, మరి ఆ మొబైల్ ఏమైందని చంద్రబాబు ఎందుకు అడగడం లేదని బొత్స ప్రశ్నించారు.