ఒక్కడిని ఎదుర్కోవడానికి నలుగురు మంత్రులా? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఎవరూ ఊహించనివిధంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగురవేసి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.... అధికార టీఆర్ఎస్ పై తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిత్యం టీఆర్ఎస్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా నలుగురు మంత్రులపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రుల్లో నలుగురికి గ్రానైట్ మాఫియాతో లింకులున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కోట్ల రూపాయల మేర పన్ను ఎగ్గొట్టి గ్రానైట్ అక్రమ దందా నిర్వహిస్తున్నారని అన్నారు. ఆ నలుగురు మంత్రుల అక్రమ గ్రానైట్ దందాపై హైకోర్టులో పిల్ వేయనున్నట్లు ప్రకటించారు. ఇక తనను ఒక్కడిని ఎదుర్కోవడానికి ఉమ్మడి కరీంనగర్ నుంచి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారంటూ సెటైర్లు వేశారు.

అయితే, బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా రియాక్టయ్యారు. బండి సంజయ్ ఏమైనా పెద్ద పోటుగాడా అంటూ తీవ్ర పదజాలం వినియోగించిన గంగుల... గ్రానైట్ అక్రమ దందా ఎక్కడ జరుగుతుందో నిరూపించాలని సవాలు విసిరారు. ఆరుగురు కొత్త మంత్రులు నలుగురికి గ్రానైట్ అక్రమ దందాతో లింకులున్నాయన్న బండి సంజయ్... వాటిని నిరూపించకపోతే జైలుకు వెళ్లాల్సి ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు.

కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్.... మంత్రి గంగుల కమలాకర్ ఇద్దరూ కోర్టుకు వెళ్తామంటున్నారు. అయితే, గ్రానైట్ మాఫియాతో మంత్రులకు లింకులున్నాయంటూ హైకోర్టులో పిల్ వేస్తానని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెబుతుంటే, ఆరోపణలను నిరూపించకపోతే కోర్టుకు లాగుతామని గంగుల కమలాకర్ హెచ్చరిస్తున్నారు. మరి ఈ గ్రానైట్ ఫైట్ ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.